దేశంలో అతిపెద్ద అవినీతి పార్టీ టీడీపీ : జివిఎల్

దేశంలో అత్యంత అవినీతి పార్టీ టీడీపీ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహరావు ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమ కేసులను ఎదుర్కొంటున్న నేతలను సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తమకు ఫిర్యాదులు వచ్చాయని, అధికారులను పట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని కోరగా దానిని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు. డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబునాయుడు నిస్సగ్గుగా రాజ్యాంగం పట్ల ఎలాంటి బాధ్యత లేకుండా లూటీచేసే టీడీపీ నేతలను రక్షించడం దారుణమని మండిపడ్డారు. వారందరినీ కాపాడటం కోసం సీబీఐని రానివ్వమనే నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయమని ఆయన చెప్పారు. 1969 నుండి ఉన్న సర్క్యులర్‌ను కూడా పక్కన పెట్టేసి కేంద్రప్రభుత్వ సిబ్బందిపై నిర్ణయాలు, చర్యలకు అవకాశం లేకుండా చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, రాజ్యాంగాన్ని కాలరాయాలని చూస్తున్నారని అంటూ సీబీఐ అంటే ఎందుకంత భయం అని నిలదీశారు.

చిన్న పిల్లలకు కూడా టీడీపీ నేతల అవినీతి అర్ధమైపోయిందని, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం అవుతోందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ,చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పార్లమెంటు సభ్యులుగా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే సీబీఐని నిరోధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం చూస్తుంటే అక్రమార్కులను కాపాడే ప్రయత్నమేనని ఆయన ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వం సీబీఐని నిరోధించడం అంటే రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడమేనని జీవీఎల్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు చదివి వినిపించారు. ఆర్టికల్ 257ను దుర్వినియోగం చేయడమేనని  చెబుతూ న్యాయస్థానాలు తీసుకోవల్సిన నిర్ణయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం దారుణమని పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాల ద్వారా అవినీతి పరులను రక్షించే ప్రయత్నం తేటతెల్లం అవుతోందని స్పష్టం చేశారు.

కేంద్రప్రభుత్వ సంస్థలు అవినీతి పరుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సీబీఐ కూడా తన వంతు పాత్రను పోషించాలని ఆయన హితవు పలికారు.