కేసీఆర్ పర్యటనకు ముందే రేవంత్‌రెడ్డి అరెస్ట్‌

టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ మంగళవారం కోస్గిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక కాంగ్రెస్  అభ్యర్థి, ప్రదేశ్ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. మంగళవారం వేకువ జామున 3 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు గేటు తాళాలు పగులగట్టి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు.

రేవంత్‌రెడ్డితో పాటు అతని సోదరులను, వాచ్‌మెన్‌, గన్‌మెన్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతంర పరిగివద్ద వాచ్‌మెన్‌ను వదిలివెళ్లారు. ఈ సంఘటన నేపథ్యంలో పోలీసుల తీరుపై రేవంత్‌రెడ్డి భార్య గీత అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నా భర్తను బలవంతంగా తీసుకెళ్లారు. మా ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే మేం ఊరుకోం‘ అని ఆమె పేర్కొన్నారు. అనంతరం రేవంత్‌రెడ్డిని శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న అనంతరం 100 మందికి పైగా పోలీసులు అతని నివాసం వద్ద మోహరించారు. ఇంతకు ముందే కేసీఆర్‌ సభకు రేవంత్‌రెడ్డి నిరసన ర్యాలీకి పిలుపునివ్వడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 144 సెక్షన్‌ అమలవుతోంది.