ప్రత్యక్ష ఎన్నికలకు కామినేని ఇక దూరం

వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ మంత్రి, కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ప్రకటించారు. సోమవారం తన 72వ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్తూ ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇకపై అందరికీ శ్రీనుబాబుగానే అందుబాటులో ఉంటానని తెలిపారు. అయితే బీజేపీని వీడేది లేదని స్పష్టం చేశారు.

కృష్ణా జిల్లాకు చెందిన కామినేని శ్రీనివాస్‌ 2014లో నాటి బీజేపీ సీనియర్‌ నేత  కైకలూరు బీజేపీ టికెట్‌ సాధించి, టీడీపీ పొత్తుతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నవ్యాంధ్రలో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు వైద్య, ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు బయటకు రావడంతో చంద్రబాబు మంత్రివర్గంలోని  బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావు కూడా వైదొలిగారు.

నేటి రాజకీయ పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్ష ఎన్నికల్లోకి రానని శ్రీనివాస్‌ చెప్పారు. `గత ఎన్నికల్లో పెద్దలు వెంకయ్యనాయుడు కైకలూరు ప్రాంతానికి ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు కామినేని శ్రీనివాస్‌కు ఒక్క అవకాశం ఇవ్వమని అడిగారు. ప్రజలు నాపై నమ్మకంతో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. మరోసారి అవకాశం ఇవ్వమని అడిగే నైజం నాది కాదు' అని స్పష్టం చేశారు.

వ్యక్తిగత, రాజకీయ కారణాల నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ ఏదైనా రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, అధికారులు తనకు ఇచ్చిన గౌరవం మరువలేనిదని పేర్కొన్నారు. ఇక ముందు కూడా తాను పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు రూ. 600 కోట్లతో అభివృద్ధి చేశానని వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొల్లేరులోని శ్రీపెద్దింట్ల వారధి, కైకలూరులోని ఆసుపత్రి భవనం,  ఎత్తిపోతల పథకాలు, భైపాస్‌ రహదారి అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు వెల్లడించారు.