ఎట్టకేలకు నీరవ్ మోదీ ఆచూకి లభ్యం

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)ను నిండా ముంచేసి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఎక్కడున్నదీ ఎట్టకేలకు ఆచూకి లభించింది. ఆయన యూకేలోనే ఉన్నట్టు బ్రిటన్ అధికారులు భారత్‌కు ధ్రువీకరించారు. మరోవైపు ఇప్పటికే మోదీని తమకు అప్పగించాలంటూ కేంద్ర విచారణ సంస్థ సీబీఐ బ్రిటన్‌ను కోరినట్టు సమాచారం.

రూ.13 వేల కోట్ల పీఎన్‌బీ కుంభకోణం కేసులో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. నీరవ్ మోదీ, అతడి మేనమామ మెహుల్ ఛోక్సీ సహా వారికి చెందిన సహచరులు పీఎన్‌బీని మోసగించేందుకు బ్యాంకింగ్ సాధనాలను అక్రమంగా ఉపయోగించుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పీఎన్‌బీ కుంభకోణం బయటపడే నెలరోజుల ముందే వీరంతా విదేశాలకు తరలిపోయారు.

ఛోక్సీ ప్రస్తుతం అంటిగ్వాలో ఉన్నట్టు గుర్తించగా అతడికి ఇంతకు ముందే అక్కడ పౌరసత్వం ఉన్నట్టు చెబుతున్నారు. అయితే నీరవ్ మోదీ మాత్రం ఇప్పటి వరకు తన జాడ తెలియకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.

నీరవ్ మోదీ ఆచూకి లభించగానే అతనిని అప్పగించమని బ్రిటన్ ను కోరాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను సిబిఐ కోరింది. దానితో హోం మంత్రిత్వ శాఖ విదేశాంగ శాఖ ద్వారా బ్రిటన్ అధికారులకు లేఖ పంపవలసి ఉంది.