ఇద్దరు `చంద్రులకు' కాంగ్రెస్‌ పార్టీయే గురువు: మోదీ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ ఇద్దరికీ కాంగ్రెస్‌ పార్టీయే గురువు అని ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకే నాణేనికి రెండు వైపులా ఉన్న బొమ్మాబొరుసూ లాంటివని అభివర్ణించారు. సోమవారం హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో జరిగిన బిజెపి ఎన్నికల ప్రచార బహిరంగ సభలో మాట్లాడుతూ  వారసత్వ, కుటుంబ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్‌ -  టీఆర్‌ఎస్‌ తెలంగాణలో వ్యతిరేక పార్టీలుగా కనబడుతున్నప్పటికీ రెండు పార్టీల ఆలోచనా ఒక్కటేనని ప్రధాని స్పష్టం చేశారు. యూపీఏ -1 ప్రభుత్వంలో కేసీఆర్‌ కేంద్రమంత్రి పదవి చేపట్టలేదా?, తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్‌ దిల్లీలో సోనియాగాంధీకి మొక్కలేదా? అని ప్రధాని ప్రశ్నించారు.

దేశంలో మైనార్టీలకు రక్షణ లేదంటూ కొన్ని పార్టీలు ఉద్రేకాలు రెచ్చగొడుతున్నాయని, కుర్చీ కోసం ఎస్సీలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడమంటే అంబేడ్కర్‌ను అవమానించడమేనని స్పష్టం చేశారు. ఎవరి మధ్య విభేదాలు రాకుండా.. వాజ్‌పేయీ మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పటు చేశారని, ఆ రాష్ట్రాలు ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని చెప్పారు. తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని విచారం వ్యక్తం చేశారు.

కుటుంబ పార్టీలు ఓటు బ్యాంకు కోసం అభివృద్ధిని విస్మరించాయని మోదీ మండిపడ్డారు. మధ్యతరగతి ప్రజల కోసం ఏ ప్రభుత్వమూ ఆలోచించలేదని అంటూ  2022 వరకు ప్రతి ఒక్కరికీ సొంతింటి కల సాకారం చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. మేడమ్‌ సోనియా రిమోట్‌ కంట్రోల్‌తో సాగిన పాలనలో సొంతింటి కల సాకారం కాలేదని ధ్వజమెత్తారు.  తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.12,50,000 ఇళ్లు నిర్మించామని చెప్పారు. కొత్త ఇళ్లలోనే ప్రజలుదీపావళి వేడుకలు చేసుకున్నారని తెలిపారు. యూపీఏ పదేళ్ల పాలనలో కేవలం 80వేల ఇళ్లు మాత్రమే నిర్మించి ఇచ్చారని విమర్శించారు.

వంశపారంపర్య పాలనపై గళం విప్పండి 

‘ఈ ఎన్నికలు బీజేపీ ఎన్నికలనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలా? వద్దా అని తేల్చుకునే సమయమిది. ప్రజాస్వామ్యం గొంతు నొక్కి కొత్త రాజులు పుట్టుకొస్తున్నారు. వంశపారంపర్యం రాజకీయాలు పెరుగుతున్నాయి. అలాంటి వారికి సవాల్‌ విసిరి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలి. ఈ తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన 7 పార్టీలు పోటీలో ఉన్నాయి. వంశపారంపర్య పాలనకు వ్యతిరేకంగా మీ గళాన్ని విప్పండి. కొన్ని పార్టీల్లో తండ్రి పోటీ చేస్తున్నారు.. కొడుకు పోటీ చేస్తున్నారు. ఇది అంబేడ్కర్‌ సిద్ధాంతాలకు వెన్నుపోటు పొడవడమే. ఇక్కడ పోటీచేస్తున్న పార్టీల్లో బీజేపీ ఒక్కటే ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది' అని ప్రధాని పేర్కొన్నారు. 

వారసత్వం, కుటుంబ రాజకీయాలు లేని ఏకైక పార్టీ బిజెపి మాత్రమే అని ప్రధాని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని మాత్రమే తమ పార్టీ నమ్ముకుందని చెప్పారు. రాష్ట్రంలోని ఎంఐఎం పార్టీది మరో తరహా రాజకీయమని అంటూ వారసత్వం, కుటుంబంతో పాటు మతాన్ని ఆ పార్టీ నమ్ముకుందని విమర్శించారు.టిడిపి కూడా కుటుంబం, వారసత్వ రాజకీయాలనే నమ్ముకుందని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టిడిపిని  స్థాపిస్తే చంద్రబాబు మాత్రం తన స్వార్థం కోసం కాంగ్రెస్‌తోనే కలిశారని ధ్వజమెత్తారు.

యోగ్యత లేకపోయినా.. వారసత్వంగా పార్టీని, ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఎందరో సమర్థులైన నాయకులు ఉన్నప్పటికీ వారసత్వ రాజకీయాల వల్ల ఎదగలేదని విమర్శించారు. ఒక కుటుంబం తెలంగాణను లూటీ చేస్తోందని, ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కూడా ఒక కుటుంబం చేతిలోనే చిక్కుకుందని పేర్కొన్నారు. డిసెంబర్‌ 7 తర్వాత వారసత్వ, కుటుంబ పార్టీలు కనుమరుగైపోతాయని మోదీ స్పష్టం చేశారు.

రాహుల్ పై విసుర్లు

టీఆర్‌ఎస్‌-బీజేపీ బీ టీమ్‌ అని ఆయన మాట్లాడుతున్నారని అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ కర్ణాటకలో జేడీఎస్‌, బీజేపీ బీ టీమ్‌ అని ప్రచారం చేశారని ప్రధాని గుర్తు చేశారు. ఫలితాల తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలుస ని అంటూ కాంగ్రెస్-జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయని తెలిపారు. తెలంగాణలోనూ అదే జరుగుతోందని జోస్యం చెప్పారు.

డిసెంబర్‌ 7న ఓటుతో వారసత్వ పార్టీలకు చెక్‌ పెట్టాలిని పిలుపిచ్చారు. రాహుల్‌ పేరున్న నాయకుడే కానీ.. నిన్న ఏం మాట్లాడాలో.. ఈ రోజుఏం మాట్లాడుతారో తెలియదని ధ్వజమెత్తారు. రాహుల్‌కు మతిస్థిమితం లేదని ఎద్దేవా చేశారు. దేశం కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని చెబుతూ ప్రజలందరూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని తెలుగు పలుకులు..

ప్రధాని నరేంద్ర మోదీ తన తెలుగు ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఎల్బీస్టేడియంలో జరిగిన సభలో ప్రధాని తన ప్రసంగాన్ని తెలుగు పలుకులతో ప్రారంభించారు. ‘‘ఎందరో అమరవీరులు కన్న కలలు సాకారం కోసం మార్పు కోసం తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో ఆశలతో, వేలాదిగా తరలివచ్చిన తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక వందనం. హైదరాబాద్‌ అంటే నాకెంతో ఇష్టం. అలాగే సర్దార్‌ వల్లభాయి పటేల్‌ నాకు ఆదర్శం. పటేల్‌ పట్టుదల వల్లే హైదరాబాద్‌కు విమోచనం కల్గింది. అందుకే హైదరాబాద్‌ అనగానే నాకు పటేల్‌ గుర్తుకొస్తారు. అసలు సర్దార్‌ పటేల్‌ లేకపోయినట్టయితే ఈ స్వేచ్ఛ, తెలంగాణలో మీతో ఇలా ఆనందంగా మాట్లాడే అవకాశం నాకు కలిగేదే కాదు. హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయంగా ఖ్యాతిని సంపాదించి పెట్టిన ఈ తెలుగు ప్రజలందరికీ నా శుభాభివందనాలు’’ అంటూ తన తెలుగు ప్రసంగాన్ని ముగించారు.