రాజస్థాన్ లో కాంగ్రెస్ కలలు కూలి పోవలసిందే

రాజస్థాన్‌లో ఒకసారి అధికారంలో ఉన్న వారు వరుసగా రెండోసారి గెలవడం లేదని, కాబట్టి ఈసారి గెలుస్తామని కాంగ్రెస్‌ భ్రమపడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రాజస్థాన్ లోని జోధాపూర్ లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ అయితే ఈ సారి మాత్రం అలా జరగని మోదీ వెల్లడించారు. రాజస్థాన్‌ సహా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందన్న వారి కలలు కూలిపోతాయని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ అబద్ధాల విశ్వవిద్యాలయమని ప్రధాన మంత్రి ధ్వజమెత్తారు. అక్కడి వాళ్లు అబద్ధాలు చెప్పడంలో పీహెచ్‌డీ చేస్తున్నారని, ఎవరు బాగా అబద్ధాలు చెప్తే వారికి మంచి పదవి కూడా దక్కుతుందని ఎద్దేవా చేశారు.

ప్రపంచానికి భూఉష్ణతాపం అంటే ఏమిటో తెలియకముందే రాజస్థాన్‌లోని బిష్ణోయి తెగ పర్యావరాణాన్ని కాపాడేందుకు ఎంతో కృషి చేసిందని మోదీ ప్రశంసించారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అని, తన రిమోట్‌ కంట్రోల్‌ ప్రజల చేతుల్లోనే ఉందని చెప్పారు. అందుకే తాను సరిగ్గా పనిచేయగలుగుతున్నానని మోదీ తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ అసలు అభివృద్ధి గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. తనకు హిందూమతం మూలాల గురించి తెలియదని రాహుల్ గాంధీ విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ  ప్రజలు విద్య, విద్యుత్ తదితర సమస్యలకు పరిష్కారం కోసం ఓటు వేస్తారా లేదా తనకు హిందుత్వం గురించి తెలుసా, లేదా అనే విషయం ఆధారంగా ఓటు వేస్తారా అని మోదీ ప్రజలను ప్రశ్నించారు.

'హిందుత్వం గురించి నాకు విశేష పరిజ్ఞానం ఉందని ఏనాడూ చెప్పుకోలేదు. వారసుడు (నామ్‌దార్) మాత్రం అలా చెప్పుకోవచ్చు' అని రాహుల్‌కు చురకలు వేశారు. వాస్తవానికి హిందుత్వం, హిందూ మతం అంటే ఎంతో లోతైనా పరిజ్ఞానం అని, ఎంతగా శోధించినా ఇంకా ఎంతో తెలుసుకో వలసింది ఉంటుందని చెబుతూ ఋషులు, సాధువులు కూడా ఎవ్వరు తమకు పూర్తిగా తెలుసని చెప్పలేదని గుర్తు చేశారు.