రాహుల్‌కు మోదీ భయం పట్టుకుంది

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి మోదీ భయం పట్టుకుందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. రాజస్థాన్‌లో పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొంటూ ఎన్నో మంచి పథకాలు, స్వచ్ఛభారత్‌ లాంటి ప్రయోజనకర కార్యక్రమాలు చేసినప్పటికీ కాంగ్రెస్‌ ‘మోదీ హఠావో’ అంటోందని విమర్శించారు. ఎవరెన్ని చేసినా రాజస్థాన్‌లో బిజెపి  గెలుపు ఖాయమని షా విశ్వాసం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు గానీ, విధానాలు గానీ లేవని దుయ్యబట్టారు. చిత్తోడ్‌గఢ్‌లో ఎన్నికల ప్రచార సభలో అమిత్‌ షా మాట్లాడుతూ ‘మీ పార్టీ నాయకుడి పేరు చెప్పండి అని రాహుల్‌గాంధీని చాలా సార్లు ప్రశ్నించాను. కానీ ఆయన ఏం చెప్పలేదు. కాంగ్రెస్‌ పార్టీకి సరైన నాయకుడు లేడు. విధానాలు కూడా లేవు. కానీ బిజెపి అలా కాదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశభక్తులు ఉన్న పార్టీ మాది’ అని షా చెప్పుకొచ్చారు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్‌ దేశ భద్రతతో ఆడుకుంటోందని అమిత్‌ షా దుయ్యబట్టారు. సర్జికల్‌ దాడులను కూడా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.