రాజస్థాన్ విజయంపై వసుంధర రాజే ధీమా

తమ పార్టీపై , ప్రభుత్వంపై  ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజె  భరోసా వ్యక్తం చేశారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  సర్వేల ద్వారా కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత మాత్రమే పార్టీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించామని చెప్పారు. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలో 15 మందితో కమిటీ ఏర్పాటు చేసి టికెట్ల పంపకాలపై నిర్ణయం తీసుకున్నట్లు రాజె తెలిపారు.

ప్రజలకు చేరువకావడంలో విఫలమయ్యారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా ఆమె స్పందించారు. అవన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు. ‘ప్రజలతో మమేకమయ్యేందుకు మేం ఎన్నో యాత్రలు, సభలు నిర్వహించాం. పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నించాం. రాజస్థాన్‌ అంతటా గౌరవ యాత్రను చేపట్టాం. ప్రతిసారీ ఎన్నికల సమయంలో రాజె ప్రజలకు దూరంగానే ఉన్నారనే మాటలే వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే విధంగా జరుగుతోంది. కానీ తీర్పు ఏమిటనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఈసారి ఎన్నికల్లో బిజెపినే విజయం సాధిస్తుంది’ అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుత ఎన్నికలను 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా తాము భావించడం లేదని ఆమె స్పష్టం చేశారు. రాజస్థాన్‌లోని బిజెపి ప్రభుత్వంపై రైతులు, యువత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ వస్తోన్న వార్తలను ఆమె తోసిపుచ్చారు. బిజెపి  ఇప్పటికే పూర్తిచేసిన పనులను కాంగ్రెస్‌ ఇప్పుడు చేస్తామని హామీ ఇస్తోందని రాజె ఆరోపించారు.

‘కాంగ్రెస్‌ పార్టీ రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తోంది. కానీ మేం దాన్ని ఇప్పటికే చేసేశాం’ అని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత యువత, రైతుల అభివృద్ధికే తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించి పరిశ్రమలు నెలకొల్పుతామని,  తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆమె వెల్లడించారు.