బిజెపి అధికారంలోకి వస్తే ఒవైసీలు హైదరాబాద్ వదలాల్సిందే!

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే ఒవైసి సోదరులు హైదరాబాద్ ను వదిలి వెళ్ళవలసిందే అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. తెలంగాణాలో పలు చోట్ల ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడుతూ టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి పార్టీలు అనుసరిస్తున్న `సంతుస్టికరణ' విధానాల కారణంగానే ఎవ్వరు అధికారమలోకి వచ్చినా వారిని ఒవైసి సోదరులు ఆడిస్తున్నారని ధ్వజమెత్తారు. సర్దార్ పటేల్ హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి కలిగించగానే నాటి నిరంకుశ నిజాం హైదరాబాద్ ను వదిలి పారిపోయిన్నట్లు ఇక్కడ బిజెపి అధికారమలోకి వస్తే అసదుద్దీన్ ఒవైసి, అక్బరుద్దీన్ ఒవైసి కూడా అంతే అవుతుందని స్పష్టం చేశారు.

మతం ఆధారంగా ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పధకాలు రూపొందిస్తున్నామని అంటూ బిజెపి కులం, మతం ఆధారంగా ఎవ్వరి పట్ల వివక్షత చూపదని, అందరికి సమాన న్యాయం అందించే పథకాలనే అమలు చేస్తుందని యోగి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో ముస్లిం లకు అభివృద్ధి నిధులలో వాటా యిస్తామని, కాంట్రాక్టు లలో వాటా ఇస్తామని, ఉద్యోగాలలో వాటా ఇస్తామని, చివరకు ప్రత్యేకంగా ఆసుపత్రులు తెరుస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినది దుయ్యబట్టారు.

టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజల ప్రయోజనాలతో ఆటలు ఆడుతున్నాయని మండిపడుతూ తెలంగాణను నిజాం నాటి దుర్భర పరిస్థితులలోకి నెట్టివేసి పరిస్థితులు కల్పించే ప్రయత్నం చేస్తున్నాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎవ్వరికీ అరాచకం సృష్టించే అవకాశం బిజెపి ఇవ్వబోదని, ప్రజలు అందరికి రక్షణ కల్పిస్తుందని యోగి హామీ ఇచ్చారు.

అయోధ్యలో రామమందిరం నిర్మించడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన అడ్డంకిగా ఉన్నట్లు ఆదిత్యనాథ్ ఆరోపించారు. బిజెపి సుపరిపాలనను, అభివృద్ధిని అందించడం ద్వారా దేశంలో "రామరాజ్యం' తీసుకు రావడం కోసం బిజెపి ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు.

మోదీ ప్రధాన మంత్రి అయ్యాక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రెండు కోట్ల మందికి ఇండ్లు కట్టించారని వెల్లడించారు. ఇప్పటికీ తెలంగాణ ఇండ్లులేవు. ,మరుగుదొడ్లు కట్టలేదని చెబుతూ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు దొందూదొందేనని విమర్శించారు. కాంగ్రెసోళ్లు ప్రభుత్వం తమదే వస్తుందంటున్నారు..కానీ వాళ్లు వస్తే అంతా నష్టమేనని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినా ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు.

ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి ఓటు బ్యాంకు లేదు కానీ ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. అలాగే తెలంగాణాలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. బీజేపీ దేశ ప్రజల పార్టీ, తెలుగు గడ్డపై పుట్టిన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారు..సామాన్య కుటుంబంలో పుట్టిన మోదీ ప్రధాన మంత్రి అయ్యారు అంటే అది కేవలం బీజేపీ ఘనతేనని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీల్లో కుటుంబ పాలనే ఉంటుందని విమర్శిస్తూ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ముస్లింలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారని సూటిగా ప్రశ్నించారు. మత ప్రాతిపదకన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని తేల్చి చెప్పారు. బీజేపీ ప్రజలను రక్షిస్తుంది.. అభివృద్ధి చేస్తుంది..రామ రాజ్యం తెస్తుంది..అట్టడుగు వర్గాల అభివృద్ధి బీజేపీకే సాధ్యమని పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం అందరూ బీజేపీకే ఓటేసి గెలిపించాలని కోరారు.