ఉద్యోగుల సంక్షేమమే గాని ఉద్యోగ భర్తీ ప్రస్తావించని కేసీఆర్

మరో ఐదు రోజులలో ఎన్నికలు జరుగుతుండగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదివారం రాత్రి పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎన్నికల ప్రణాళికలో సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని అమలు పరుస్తామని చెప్పడమే గాని ప్రభుత్వంలో ఉన్న లక్షలాది ఉద్యోగాల భర్తీ అంశాన్ని గాని,  ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం గురించి గాని అసలు ప్రస్తావించని  లేదు.

పైగా ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతామని, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతామని,  ఉద్యోగ నియామకాల వయోపరిమితి మూడేళ్లకు పెంచుతామని హామీ ఇవ్వడం ద్వారా ఇప్పట్లో ఉద్యోగాల భర్తీ ఉండకపోవచ్చని సంకేతం ఇచ్చిన్నట్లు అయింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని చెప్పిన కేసీఆర్ గత నాలుగున్నరేళ్లలో 20 వేలకు మించి భర్తీ చేయలేక పోయారు. అట్లాగే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడం గురించి  కూడా ప్రస్తావించాహనే లేదు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పి రెండేళ్లయినా ఆ దిశలో అడుగులు వేయని లేదు.

ఇక 2014 ఎన్నికలలో కీలకమైన హామీలైన దళితులకు మూడెకరాల భూమి, ఎల్కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్యను సహితం గాలికి వదిలివేసిన్నట్లు అయింది. ఈ సారి ఎన్నికల ప్రణాళికలో అసలు ఆ అంశాన్నే ప్రస్తావించ లేదు. అంటే వాటిని అమలు చేయడం తమకు సాధ్యం కాదని అంగీకరించినట్లు అయింది. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించడం ద్వారా నిరుద్యోగ యువతలో నెలకొన్న అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేశారు.

పాలనా యంత్రాంగాన్ని మంచి చేసుకొనే ప్రయత్నం చేసిన్నట్లు అయింది. ఉద్యోగులకు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణ చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు  పింఛనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొనడం కూడా ప్రభుత్వ ఉద్యోగులను సంతృప్తి పరచడం కోసమే అని భావించవచ్చు.

ఇప్పటికి అమలు చేసిన రుణమాఫీ పధకం వల్లననే రైతులు రుణవిముక్తి పొందలేక పోయారని, తాజాగా రుణాలు పొందలేక పోతున్నారని, సకాలంలో ప్రభుత్వం రుణాలను చెల్లించక పోవడంతో వడ్డీల భారంతో రైతులు ఆందోళన చెందుతూ ఉంటె మరో లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుతం అమలు చేస్తున్న రైతు బంధు పధకం, ఇంతకు ముందు అమలు చేసిన రుణమాఫీ వల్లన రైతులు రుణ విముక్తులు కాలేక పోయారని, వారి ఆర్ధిక పరిస్థితులు మెరుగు పడలేదని  ఒప్పుకున్నట్లు అవుతున్నది.

రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయం రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంపుదల చేస్తామని చెప్పారీ గాని వ్యవసాయ మార్కెట్ లలో దళారులను కట్టడి చేస్తామని, రైతులకు గిట్టుబాటు ధరలు లభించే విధంగా ధరల స్థిరీకరణ నిధిని అందిస్తామని గాని, నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని గాని పేర్కొనకపోవడం గమనార్హం.

నాలుగున్నరేళ్లుగా మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వకుండా, ప్రస్తుత ఎన్నికలలో కూడా కేవలం నలుగురు మహిళలకు మాత్రమే సీట్లు ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు చట్టసభలలో మహిళలు, బిసి లకు 33 శాతం చొప్పున రేజర్వేషన్లు అమలు జరుపుతామని ప్రకటించారు. పార్లమెంట్ లో చట్టం తీసుకు వస్తే గాని అది సాధ్యం కాదు. తన పరిధిలో పార్టీలో, పదవులలో మహిళలకు, బిసిలకు కొంత శాతం మేరకు అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఉంటె వారి పట్ల కేసీఆర్ శ్రద్ధను వెల్లడించినట్లు అయి ఉండెడిది. కేవలం మాటలతో వారి సానుభూతి పొందే ప్రయత్నం గానే కనిపిస్తున్నది. '

టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో ప్రధాన అంశాలు

*  అన్ని రకాల ఆసరా పింఛన్లు రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంపు. వికలాంగుల పింఛన్లు రూ.1500 నుంచి రూ.3,016 వరకు పెంపు. బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ డేట్‌ 2018 వరకు పొడిగింపు.

* వృద్ధాప్య పింఛను అర్హత వయసు 65-57 ఏళ్లకు తగ్గింపు.

* ప్రస్తుత పద్ధతిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తూనే, సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్రూం ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల నుంచి 6 లక్షల వరకు అందిస్తాం.

*. ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ఆమోదం కోసం పోరాటం.

* అగ్ర కులాల్లోని పేదల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు.

* రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు. ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయడం. ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగిస్తాం. ఇవి తయారు చేసే కల్తీ లేని ఆహార పదార్థాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ.

* ‘కంటి వెలుగు’ పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలు. ప్రతి వ్యక్తి హెల్త్‌ ప్రొఫైల్‌ రికార్డు చేసి, రాష్ట్ర హెల్త్‌ ప్రొఫైల్‌ రూపకల్పన.

* బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు చర్యలు.

*. సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారికి పట్టాలు.

*హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు మరింత ముమ్మరం.