లోకేష్, చంద్రబాబుల అవినీతి నిరూపణకు సిద్ధం

నారా లోకేష్, చంద్రబాబుల అవినీతి బయట పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేసారు.  పార్వతీపురంలో ఆయన  మాట్లాడుతూ వారి అవినీతిని నిరూపించలేకపోతే జైలుకి వెళ్ళడానికి సిద్ధమని పేర్కొన్నారు. తండ్రీకొడుకులు అంత నీతిమంతులైతే రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వస్తే ఆయన స్వయంగా సీబీఐ దర్యాప్తుకు సిద్ధపడ్డారని గుర్తుచేశారు. లోకేశ్‌కు, చంద్రబాబుకు ధైర్యముంటే సీబీఐ దర్యాప్తు చేయించుకొని.. నిజాయతీ నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. 2014 ఎన్నికల్లో  సోనియాగాంధీపై అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆమెతో చేతులు కలిపి.. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతిపరులంతా కలసి మహాకూటమిని ఏర్పాటు చేశారని మండిపడ్డారు. మహాకూటమి కాదు అది పెద్ద దొంగల కూటమి అని అభివర్ణించారు.  ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నరేంద్ర మోదీ పాలననే స్వాగతిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.