బిజెపి అభ్యర్ధిగా గౌతమ్ గంభీర్ పోటీ !

కొన్నాళ్లుగా టీమ్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నట్లు వార్త కధనాలు వస్తున్నాయి. అంతేకాదు వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ నుండి పోటీ చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. జాతీయ భావాలు, దేశభక్తి ఎక్కువగా ఉండే గంభీర్‌కు భారతీయ జనతా పార్టీ తమ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

దేశానికి సంబంధించి ఏ అంశంపై అయినా స్పందించడానికి గంభీర్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈ విషయంలో గంభీర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. ఇది తమకు ఉపయోగపడుతుందని భావిస్తున్న బీజేపీ గౌతమ్ ను బరిలోకి దింపడానికి సిద్ధమవుతున్నది.

ఇప్పటికే అజారుద్దీన్, నవజోట్ సింగ్ సిద్ధూ, కీర్తి ఆజాద్ లాంటి క్రికెటర్లు రాజకీయాల్లో ఉన్నారు. అజర్ గతంలో ఎంపీగా చేయగా,  సిద్ధూ కుడా గతంలో లోక్ సభకు ఎన్నికై  ప్రస్తుతం పంజాబ్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు. కీర్తి ఆజాద్ ప్రస్తుతం ఎంపి.

 అయితే గంభీర్ ప్రస్తుతానికి ఇంకా అధికారికంగా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించలేదు.  36 ఏళ్ల గౌతీ.. 2011 వరల్డ్‌కప్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో 97 పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. గంభీర్ తన కెరీర్‌లో మొత్తం 58 టెస్టులు, 147 వన్డేలు ఆడాడు.