ఎంఐఎం ముందు సాగిలపడే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా వారి ముఖ్యమంత్రులు ఎంఐఎం ముందు సాగిలపడి వారేనని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరించారు. సంగారెడ్డిలో జరిగిన బిజెపి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రిగా ఎవ్వరు ఉన్నా తన కాళ్ళ దగ్గర పడి ఉండవలసిందే అంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసి బహిరంగంగానే అన్నారని గుర్తు చేశారు. అటువంటి ప్రభుత్వం కావాలా అని ప్రశ్నించారు. కేవలం బిజెపి ముఖ్యమంత్రి మాత్రమే ఆత్మగౌరవంతో, స్వతంత్రంగా పనిచేయగలరని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో మసీదులు, చర్చి లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటికిస్తే తమకు అభ్యంతరం లేదని, కానీ దేవాలయాలకు ఇవ్వరా అని ప్రశ్నించారు. ఇటువంటి వివక్షత ఎందుకని నిలదీశారు. అదే విధంగా ముస్లింలకు, ఉర్దూ బాషాకు ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారని ఇతర మతస్థులకు, తెలుగు మాట్లాడే వారికి సంగతి ఏమిటని ప్రశ్నించారు.

మైనారిటీలు విదేశీ విద్య కోసం రూ 20 లక్షల వరకు సహాయం చేస్తామని, కాంట్రాక్టు లలో మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తున్నదని చెబుతూ ఈ వివక్షత ఎందుకని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి పార్టీలు మైనారిటీలను సంతృప్తి పరచే ఓట్ బ్యాంకు రాజకీయాలను అనుసరిస్తున్నాయని దుయ్యబట్టారు. 

ప్రస్తుతం తెలంగాణలో త్రిముఖ పోరు సాగుతోందని చెబుతూ ఎంఐఎం దగ్గర ఆత్మాభిమానం తాకట్టుపెట్టిన టీఆర్‌ఎస్‌, పాక్‌ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకున్న సిద్ధూ ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్‌, మోదీ సారథ్యంలో దేశభక్తులతో కూడిన బీజేపీల మధ్య పోరాటం జరుగుతోందని అమిత్ షా అభివర్ణించారు.

కేసీఆర్‌ తన కుటుంబసభ్యుల కోసం ముందస్తుకు వెళ్లి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనం ముందు నిలువలేమనే భయంతో ముందస్తుకు కేసీఆర్‌ మొగ్గుచూపారని విమర్శించారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలనలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో బీజేపీ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. నారాయణపేట అభివృద్ధి సాధించాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు.

కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారని షా దుయ్యబట్టారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు అవకాశం లేదని అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన కింద రెండు కోట్ల ఇళ్ల నిర్మాణాలు జరిగితే తెలంగాణలో ఈ పథకం అమలు కాని కారణంగా ఏ ఒక్కరూ లబ్ధి పొందలేకపోయారని బిజెపి నేత చెప్పారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం సైతం తెలంగాణలో అమలు చేయలేదని ఆయన దుయ్యబట్టారు.