2022లో జి-20 సదస్సు భారత్ లో

అర్జెంటినా రాజధాని బ్యూనస్‌ఎయిర్స్‌లో జరిగిన జీ-20 అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా 2022లో ఈ సదస్సు నిర్వహణకు భారత్ ఆతిధ్యం ఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ సంవత్సరం భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోవడం విశేషం.

"2022లో భారత్ స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ సందర్భంగా భారత్ లో జరిగే జి-20 సదస్సులో పాల్గొనడం కోసం ప్రపంచ నేతలకు స్వతతం పలకడానికి ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ గల భారత్ ఎదురు చూస్తుంది. భారత్ ఘనమైన చరిత్రని, వైవిధ్యాన్ని, ఆహ్లాదకరమైన ఆతిధ్యం గురించి తెలుసుకోమని ఆహ్వానించాను" అని ట్వీట్ ద్వారా తెలిపారు.

ముందుగా ఈ సదస్సు ఇటలీలో జరపాలని నిర్వహించారు. ప్రధాని మోదీ కోర్కె మేరకు భారత్ కు సదస్సు మార్చడానికి ఇటలీ అంగీకారం తెలిపింది. అందుకు మోదీ ఆ దేశానికి ధన్యవాదాలు తెలిపారు. జి-20లో ప్రపంచంలోని 20 ప్రధాన ఆర్ధిక వ్యవస్థలు గల దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అవి ఆర్జెంటినా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యురోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యుకె, అమెరికా.

ఈ మొత్తం దేశాలు ప్రపంచంలోని స్థూల ఉత్పత్తిలో 90 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం కలిగి ఉన్నాయి. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల జనాభా ఈ దేశాలలో ఉన్నారు. ప్రపంచ భూమి దాదాపు సగం ఈ దేశాలలో ఉంది. ఈ సమావేశానికి స్పెయిన్ శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నది.