సర్వేల పేరుతో ఓటర్లను గందరగోళ పరుస్తున్న లగడపాటి

ఎన్నికల పక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్నికల సర్వే ఫలితాలను ప్రకటించడం పట్ల ఎన్నికల కమీషన్ నిషేధం విధించింది. ఎవ్వరైనా సర్వేలు జరిపినా డిసెంబర్ 7న పోలింగ్ పూర్తయిన తర్వాతనే ప్రకటించుకో వలసి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఏ పార్టీలో, ఎవ్వరితో ఉన్నారో తెలియని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎన్నికల సర్వే పేరుతో తెలంగాణ ఓటర్లలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాసటగా నిలబడుతూ, కాంగ్రెస్ తో చెయ్యి కలపడం ద్వారా ఆత్మరక్షణలో పడిన ఆమనకు స్థైర్యం కల్గించే రీతిలో అప్పుడప్పుడు ఏదో ఒక `లీక్' ఇస్తూ ప్రజాకూటమిని గెలిపించడం కోసం ఎన్నో తంటాలు పడుతున్నట్లు భావించ వలసి వస్తున్నది. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం లేదని ఒక వంక చెబుతూనే ఓటర్లలో గందరగోళం సృష్టించి అటువంటి పరిస్థితులు ఏర్పడే విధంగా చేయడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.

ఆ విధంగా చేయడం ద్వారా తటస్థ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధం అవుతున్నది. పలువురు ప్రముఖులు ఓటమి చెందుతారని అంటారు. పలువురు స్వతంత్రులు గెలుస్తారంటారు. 8 నుండి 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందుతారని రెండు పేర్లు చెప్పారు. రోజుకు రెండు పేర్లు చెబుతాను అన్న ఆయన తర్వాత నోరు మెదపటం లేదు.

 రాష్ట్ర శాసనసభ రద్దయిన కొద్ది రోజులకు లగడపాటి తొలి సర్వే జరిపించి టీఆర్‌ఎస్‌కు 90 సీట్లు వస్తాయని ప్రకటించారు. ఇప్పుడు తాజా సర్వేలో 10 మంది వరకు ఇండిపెండెంట్లు గెలుస్తారని చెబుతున్నారు. ఈ విధంగా చెప్పడం ద్వారా  రాష్ట్రంలో తటస్థంగా ఉండే ఓటర్లను కూటమివైపు మరల్చె విధంగా అడుగులు వేస్తున్నారు.