ఆక్రమిత కాశ్మీర్ లోని శారదా పీఠంపై ఇప్పుడు దృష్టి

సుమారు రెండు దశాబ్దాలుగా భారత్ దౌత్య ప్రయత్నాల ఫలితంగా సిఖ్ ల మత గురువు గురు నానక్ 18 ఏళ్లపాటు గడిపిన పాకిస్థాన్ లోని కర్తార్‌పూర్‌ వద్ద గల గురుద్వారాను సందర్శించు కొనేందుకుకే మార్గం సుగమం అయిన విధంగా ఇప్పుడు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో నెలకొన్న సనాతన శారదా పీఠం సందర్శనకు అవకాశం కల్పించాలనే డిమాండ్లు కాశ్మీర్ లోయలో బయలు దేరాయి. 

ఈ విషయమై మొదటగా జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ చొరవ తీసుకొని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని శారదా పీఠానికి భక్తులను అనుమతించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ వ్రాసారు. ఆమె డిమాండ్‌ను ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా కూడా మద్దతు పలికారు.

'కాశ్మీరీ పండిట్ల కోసం శారద పీఠం మార్గాన్ని ప్రారంభించాలని మోడీకీ లేఖ రాసాను, కర్తార్‌పూర్‌ మాదిరిగానే ఈ ప్రాంతంలో శాంతికి ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నాను' అని ట్వీటర్‌లో ముఫ్తీ తెలిపారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌కు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ శంకుస్థాపన చేసిన కొన్ని రోజుల తరువాత ముఫ్తీ ఈ విజ్ఞప్తి చేశారు.

వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న శార్ది అనే చిన్ని గ్రామంలో ఈ పురాతన ఆలయం ఉంది. ఈ గ్రామం నుంచే నీలం నది ( కిషన్‌గంగ) ప్రవహిస్తోంది. ఈ మందిరానికి అనుమతించాలని కాశ్మీరి పండిట్ల కొంత కాలంగా ఆందోళన కూడా చేస్తున్నారు. దేశ విభజన కాలం నుండి ఈ ఆలయాన్ని సందర్శించుకోలేక పోతున్నారు. 2007 నుంచి వాస్తవాధీన రేఖ దాటడానికి అనుమతి ఇస్తున్నారు. అయితే ఇది కేవలం జమ్మూకాశ్మీర్‌కు చెందిన వారికి మాత్రమే తమ బంధువులను కలవడానికి అనుమతిస్తున్నారు. కానీ ఈ దేవాలయం సందర్శనకు అనుమతి ఇవ్వలేదు.

కాగా, మెహబూబా ముఫ్తి చేసిన విజ్ఞప్తితో నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ నేత ఒమర్‌ అబ్ధుల్లా కూడా ఏకీభవించారు. జమ్మూకాశ్మీర్‌లో ఉన్న చారిత్మ్రాక ప్రదేశాలకు మార్గాలు ప్రారంభించాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని ఈ సందర్భంగా  ముఫ్తీ  గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాల కోసం కర్తార్‌పూర్ కారిడార్ మాదిరిగానే శారదా పీఠం గురించి కూడా పరిశీలించాలని కోరారు. భారతదేశం, పాకిస్థాన్ మధ్య సంబంధాల్లో బాధాకరమైన చరిత్రలో నూతన అధ్యాయానికి ఈ చర్య దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. 

ముఖ్యంగా కాశ్మీరీ పండిట్ లు ఈ దేవాలయ సందర్శనకు అనుమతి చాలాకాలంగా కోరుతున్నారు. చివరి సారిగా ఈ ప్రాంతం సందర్శించడానికి కాశ్మీర్ లోయ ప్రజలను పాకిస్థాన్ అనుమతించిన, వారిని తమ బంధువులను కలవడానికి మాత్రమే ఒప్పుకున్నారు. ఈ దేవాలయ సందర్శనకు ఒప్పుకోలేదు.

ఈ ప్రాచీన హిందూ దేవాలయం ప్రక్కనే శిధిలావస్థలో ఉన్న శారదా విశ్వవిద్యాలయం కూడా ఉంది. ముజాఫ్ఫారాబాద్ కు 160 కి మీ దూరంలో నీలం లోయలో ఈ గ్రామం నెలకొంది. `సేవ్ శారదా కమిటీ' ఆధ్వర్యంలో కాశ్మీరీ పండిట్ లను ఈ దేవాలయ సందర్శనకు అనుమతించాలని కోరుతూ ఉద్యమాలు జరుపుతున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా కాశ్మీర్ ప్రాంతం వారీ కాకుండా ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు. రెండు దేశాల ప్రధాన మంత్రులకు లేఖలు కూడా వ్రాస్తున్నారు.

చివరిసారిగా 2007లో కాశ్మీర్ కు చెందిన స్కాలర్, భారత సాంస్కృతిక సంబంధాల మండలి జమ్మూ, కాశ్మీర్ డైరెక్టర్ ఆచార్య అయాజ్ రసూల్ నజకి సందర్శించి, ఈ దేవాలయం ఎటువంటి ఆదరణ కోచుకోలేక ఉన్న ఫోటోలను తీసుకు వచ్చారు.

ప్రాచీన కాలయంలో, ముఖ్యంగా 6 నుండి 12వ శతాబ్దం వరకు ప్రముఖ విజ్ఞాన కేంద్రంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. కల్హణ, ఆది శంకరాచార్య, వైరొత్సన కుమారారాజివ్, తొంమి సమ్భోట వంటి ప్రసిద్ధులు ఇక్కడ అధ్యయనం చేసి, ప్రామాణిక గ్రంధాలను వ్రాసారు. పాణిని, హేమచంద్ర ఇక్కడనే సంస్కృత వ్యాకరణాన్ని తయారు చేశారని చెబుతూ ఉంటారు. ఇది హిందువులకు, బౌద్దులకు కూడా ప్రముఖ పుణ్యక్షేత్రం.

కాశ్మీర్ లో నెలకొన్న ప్రముఖమైన మూడు తీర్ధాలలో ఇదొక్కటి. మొదటి రెండు మార్తాండ్ సూర్య దేవాలయం, అమరనాథ్ దేవాలయం. ఇక దేశంలోని 18 ప్రసిద్ధ మహా శక్తీ పీఠాలలో ఇదొక్కటి.