అమెరికాలో చదువుకున్న వారికే వీసాల్లో ప్రాధాన్యం

హెచ్1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియలో ట్రంప్ యంత్రాంగం భారీ మార్పులను ప్రతిపాదించింది. వాటి ప్రకారం అమెరికాలో చదువుకున్న వారికి అధిక ప్రాధాన్యం లభించడమే కాకుండా, విదేశీ ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఏర్పడనుంది. అత్యంత ప్రతిభావంతులు, అధిక వేతనం పొందే విదేశీ ఉద్యోగులకు ఇచ్చే హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే కంపెనీలు ముందుగానే ఎలక్ట్రానిక్ రూపంలో యూఎస్‌సీఐఎస్ (అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ) వద్ద నమోదు చేసుకోవాలని ఓ కొత్త నిబంధనను కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది.

అమెరికన్ కాంగ్రెస్ నిర్దేశించిన ప్రకారం ప్రతి ఏడాది 65వేల మందికి మాత్రమే హెచ్1బీ వీసాలను జారీ చేయాలని పరిమితి విధించారు. అయితే హెచ్1బీ వీసా కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో 65వేల మందిని యూఎస్‌సీఐఎస్ లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తున్నది. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకన్నా పై చదువులు చదువుకున్న వారు హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే అలాంటి వాటిలో నుంచి మొదటి 20వేల దరఖాస్తులను ఆ పరిమితి నుంచి మినహాయిస్తారు. వీరికి నేరుగా హెచ్1బీ వీసా లభిస్తుంది.ఇక మిగిలిపోయిన దరఖాస్తులను లాటరీ ద్వారా ఎంపిక కోసం పంపుతారు.

భారత ఐటీ సంస్థలు, నిపుణులు పెద్దయెత్తున ఈ వీసాల కోసం దరఖాస్తుచేసే సంగతి తెలిసిందే. ఏటా 65,000 హెచ్‌-1బి వీసాలను అమెరికా జారీచేస్తుంది. అమెరికాలో మాస్టర్‌ డిగ్రీ లేదా ఉన్నత విద్య అభ్యసించిన వారికిచ్చే 20,000 వీసాలు వీటికి అదనం. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఈ 20,000 వీసాల కోసం దరఖాస్తులను విడిగా సేకరిస్తారు. వీటిలో పరిమితికి సరిపడా ఎంపిక చేసిన అనంతరం మిగిలిన దరఖాస్తులను సాధారణ దరఖాస్తుల్లో కలిపి 65,000 దరఖాస్తులను ఎంపిక చేస్తారు. ఈ విధానంలో తాజాగా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌) మార్పులు ప్రతిపాదించింది.

ఇకపై మొదటగా ఉన్నత విద్య కేటగిరీ దరఖాస్తులను, సాధారణ హెచ్‌-1బి దరఖాస్తులను కలిపి 65,000 ఎంపిక చేస్తారు. ఎంపిక అనంతరం మిగిలిన వాటిలో అమెరికా మాస్టర్‌ డిగ్రీ లేదా ఉన్నత విద్య అభ్యసించిన వారి దరఖాస్తులను వేరుచేస్తారు. వీటి నుంచి 20,000 వీసాలను ఎంపిక చేస్తారు. ఈ మార్పులతో అమెరికా మాస్టర్‌ డిగ్రీ లేదా ఉన్నత విద్య పట్టా ఉండేవారికి వీసాలు వచ్చే అవకాశం పెరుగుతుందని డీహెచ్‌ఎస్‌ తెలిపింది.

మొత్తంగా 16 శాతం (5340 వీసాలు) వరకు ఎక్కువ వీసాలు అమెరికాలో విద్యాభ్యాసం చేసేవారికి దక్కనున్నట్లు అంచనా వేసింది. సోమవారం నుంచి జనవరి 2 వరకూ ప్రజలు ఈ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలు తెలియజేయొచ్చని పేర్కొంది.

ఈ ప్రక్రియ ద్వారా హె1బీ వీసాల జారీలో అమెరికాలో చదువుకున్న వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. తద్వారా విదేశీ ఉద్యోగుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త నిబంధన వల్ల అత్యంత ప్రతిభావంతులు ఎంపికయ్యే అవకాశం ఉందని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రతిపాదిత మార్పుల వల్ల అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకన్నా ఉన్నత విద్యను అభ్యసించిన లబ్ధిదారుల సంఖ్య 16 శాతం (5,430 మంది ఉద్యోగులు) పెరుగవచ్చని డీహెచ్‌ఎస్ పేర్కొంది. ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగులను కోరుకునే సంస్థలు ఎలక్ట్రానిక్ రూపంలో నమోదు చేసుకోవడం ద్వారా ఖర్చులు తగ్గుతాయని తెలిపింది.