కేరళకు తెలంగాణ రూ 25 కోట్ల సహాయం

కనీవినీ ఎరుగని ఆపదలో ఉన్న కేరళకు తెలంగాణ సమాజం అన్ని విధాలా చేయూతనందిస్తున్నది. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వం ప్రకటించిన రూ.25 కోట్ల రూపాయల చెక్కును రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్వయంగా త్రివేండ్రం వెళ్లి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు అందజేశారు.

చిన్నారుల కోసం వంద టన్నుల పౌష్టికాహారాన్ని పంపించిన ప్రభుత్వం, పరిశుభ్రమైన నీటిని అందించడం కోసం రెండున్నర కోట్ల విలువైన యాభై ఆర్వో ప్లాంట్లను, 20 టన్నుల పాలపొడిని రక్షణశాఖ విమానంలో సహాయ సిబ్బందితోపాటు పంపించింది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు, చిన్న ఉద్యోగులు సైతం తమవంతు సాయాన్ని అందించడానికి ముందుకొస్తున్నారు.

అధికార పార్టీకి చెందిన ఇరవై మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు తమ నెల వేతనాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించాలని నిర్ణయించినట్టు పార్టీ పార్లమెంటరీపార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభాపక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ వెల్లడించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు విరాళాలు ప్రకటించారు.

ఎంఐఎం పార్టీ రూ.16 లక్షల విరాళం ప్రకటించగా, జైళ్లశాఖ సిబ్బంది రూ.25లక్షల విరాళమివ్వడానికి ముందుకొచ్చారు. సినీ ప్రముఖులు కూడా కేరళ బాధితులకు అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నారు. ఎంత సహాయం చేసినా కేరళ ప్రజలకు కలిగిన ఇబ్బందులు తీర్చలేనివని, మానవతా దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం చేయవలసిన సహాయాన్ని చేస్తున్నదని హోం మంత్రి నాయిని సియం విజయన్‌తో సమావేశం అనంతరం పేర్కొన్నారు.