హిందూయిజం గురించి రాహుల్‌తో పాఠాలా !

హిందూయిజం గురించి రాహుల్‌తో పాఠాలు చెప్పించుకునే రోజు తమకు ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్నట్టు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఏ తరహా హిందువంటూ రాహుల్ ప్రశ్నించిన కొద్దీ గంటలకే ఆమె ఘాటుగా సమాధానం చెప్పారు.

రాహుల్ గాంధీని ఏళ్ల తరబడి సెక్యులర్ నేతగా చెబుతున్న శతాధిక వత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటం, మెజారిటీ ప్రజలు హిందువులే కావడంతో ఆయనకు హిందూ ఇమేజ్ కల్పించే ప్రయత్నం చేస్తోందని ఆమె అవహేళన చేశారు.

'రాహుల్ గాంధీ జంధ్యం ధరించే హిందువని కాంగ్రెస్ చెబుతోంది. అయితే ఆయన హిందూయిజం గురించి మాకు పాఠాలు చెప్పగలిగేంత జ్ఞానవంతుడని ఇప్పటి వరకూ నాకు తెలియదు. ఒక హిందువుగా రాహుల్ గాంధీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన రోజు ఎప్పటికీ రాకూడదనే నేను ఆశిస్తున్నా' అని సుష్మాస్వరాజ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

అంతకుముందు, రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదంపూర్ జిల్లాలో వాణిజ్యవర్గాలు, మేథావులతో జరిపిన ముఖాముఖీలో రాహుల్ పాల్గొంటూ...భగవద్గీత ఏం చెప్పిందనే విజ్ఞానం అందరి వద్దా ఉందని, జీవించే ప్రతి ఒక్కరికీ విజ్ఞానం ఉంటుదని చెప్పారు.

'ప్రధాని తాను హిందువునని అంటారు. కానీ ఆయన హిందుత్వ మూలాలను అర్థం చేసుకోలేదు. ఆయన ఏ రకమైన హిందువు?' అని ప్రశ్నించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన వ్యాఖ్యలను సుష్మాస్వరాజ్‌ తిప్పికొట్టారు.