ఆర్థిక నేరగాళ్లపై 9 పాయింట్ల మోదీ అజెండా

పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకు దేశాల మధ్య పరస్పర సహకారం ఉండాలని కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ అర్జెంటీనాలో జరుగుతున్న జీ20 దేశాల సదస్సులో వెల్లడించారు. ఆర్థిక నేరగాళ్లను శిక్షించేందుకు మోదీ 9 పాయింట్లతో కూడిన అజెండాను సదస్సులో ప్రవేశపెట్టారు.  సదస్సు రెండో సెషన్‌లో అంతర్జాతీయ ట్రేడ్‌, అంతర్జాతీయ ఆర్థిక, పన్ను విధానాల గురించి చర్చించిన నేపథ్యంలో మోదీ ఈ అజెండాను ఇచ్చారు.

న్యాయ పరమైన ప్రక్రియలో దేశాలు పరస్పరం సహకరించుకుంటే.. పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను వీలైనంత తొందరగా స్వదేశానికి రప్పించవచ్చని, వారి నేరాలను కట్టడి చేయొచ్చని మోదీ అజెండాలో పేర్కొన్నారు. పారిపోయి వచ్చే ఆర్థిక నేరగాళ్లకు ఇతర దేశాలు ఆశ్రయం ఇవ్వకుండా జీ20 దేశాలు కలిసి ఓ విధానాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు. అవినీతికి, బహుళదేశ వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా ఐరాస విధించిన నిబంధనలను అన్ని దేశాలు పూర్తిగా అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా అంతర్జాతీయ పరస్పర సహకారానికి సంబంధించిన నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.

దేశాల మధ్య పరస్పర సహకారం అందించుకునేందుకు ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌)ను ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. దీని సహాయంతో ఇరు దేశాల సంబంధిత అధికారులు, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్ల మధ్య సమయానుకూలంగా సహకారం అందుతుందని తెలిపారు.

అలాగే ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి రప్పించిన అనుభవాలను పంచుకునేందుకు, ఈ ప్రక్రియలో ఉన్న సమస్యలు, పరిష్కారాలు తెలుసుకునేందుకు సదస్సులోని దేశాల మధ్య కామన్‌ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసుకుందామని మోదీ వెల్లడించారు. జీ20 సదస్సులో మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా తదితర దేశాల అధ్యక్షులు హాజరయ్యారు.

వాడీవేడిగా ప్రారంభమైన సదస్సు

అర్జెంటినా రాజధాని బ్యూనస్‌ఎయిర్స్‌లో రెండురోజులపాటు జరుగనున్న జీ-20 అంతర్జాతీయ సదస్సు శుక్రవారం వాడీవేడిగా ప్రారంభమైంది. పదేండ్లలో తొలిసారిగా జీ-20 దేశాధినేతలు రెండుగా చీలిపోయారు. జీ-20 ప్రధాన వాణిజ్య లక్ష్యాలను దెబ్బతిస్తూ పలు దేశాలపై ఆంక్షలు విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై రష్యా సహా పలుదేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ సంక్షోభానికి కారణమైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా, దాని మిత్రదేశాలు ఆగ్రహంవ్యక్తంచేస్తున్నాయి.

రష్యా మూడు ఉక్రెయిన్ నౌకల్ని రష్యా సీజ్ చేయడంతో ఇరుదేశాల మధ్య యుద్ధఘంటికలు మోగిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌కు పలు దేశాలు అండగా నిలుస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. శుక్రవారం పుతిన్‌తో జరుగాల్సిన తన భేటీని చివరినిమిషంలో రద్దు చేసుకున్నారు. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంక్షల ప్రయోగం, వాణిజ్యరక్షణ విధానం దుర్మార్గపూరితంగా ఉంటున్నదని నేరుగా ట్రంప్‌పైనే విమర్శలు గుప్పించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్ కూడా ట్రంప్‌ది ఏకాకి వైఖరి అంటూ ఎండగట్టారు.

దేశాధినేతల ఫొటోషూట్‌లోనూ నేతల మధ్య విభేదాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. టర్కీలో జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్యకు సౌదీ యువరాజు సల్మాన్ బాధ్యత వహించాలంటూ అమెరికా, టర్కీ ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో జీ-20 సదస్సుకు హాజరైన యువరాజు సల్మాన్‌పైనే అందరి దృష్టి నెలకొంది. అధినేతల గ్రూఫ్ ఫొటో సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని మరింత ఉడికించేందుకు సల్మాన్‌ను పుతిన్ అభినందించగా.. ట్రంప్ మాత్రం ముఖం తిప్పుకుని దూరంగా జరుగడం సుస్పష్టంగా కనిపించింది.

మరోవైపు వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్న అమెరికా, చైనాల మధ్య శనివారం జరిగే ద్వైపాక్షిక చర్చలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మరోవైపు వాతావరణ మార్పులపైనా జీ-20 సదస్సులో చర్చించే అవకాశముంది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ జీ-20 సదస్సుకు ఆలస్యంగా హాజరయ్యారు.

బిజీ బిజీగా ప్రధాని మోడీ 

జీ-20 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ బిజీ బిజీగా గడిపారు. బ్రిక్స్ సభ్య దేశాల అధినేతల ఇష్టాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి మోదీ త్రైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించినట్లు తెలుస్తున్నది.

అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రిటన్ ప్రధాని థెరిసా మే, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా వారిరువురు నిర్ణయించారు. ఇక సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తోనూ మోదీ చర్చలు జరిపారు.

వాతావరణ మార్పులకు సంబంధించిన చర్చల్లో భారత్ ముఖ్యపాత్ర పోషిస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌తో జరిగిన సమావేశంలో మోదీ హామీ ఇచ్చారు. బ్యూనస్‌ఎయిర్స్‌లో జరిగిన ఓ యోగా కార్యక్రమం లోనూ మోదీ పాల్గొన్నారు.