తెలంగాణలో నేటి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్‌

కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల బకాయిలను తీర్చకపోవడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి ఆరోగ్యశ్రీ సహా ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్‌) కింద వైద్య సేవలన్నింటినీ నిలిపివేయాలని తెలంగాణ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఘం నిర్ణయించింది. దీంతో పది రోజులుగా ఔట్‌ పేషెంట్‌ సేవలు, వైద్య పరీక్షలను మాత్రమే నిలిపివేసిన ఆసుపత్రులు ఇక నుంచి ఇన్‌పేషెంట్‌ సహా అన్ని రకాల అత్యవసర సేవలనూ బంద్‌ చేయనున్నాయి.

ఆరోగ్యశ్రీ పరిధిలోని పేదలు, ఈజేహెచ్‌ఎస్‌లోని బాధితులంతా ఇబ్బందులు పడనున్నారు. బకాయిలు తీర్చకుంటే సేవలు నిలిపివేస్తామని 20 రోజుల క్రితమే నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఘం వైద్య ఆరోగ్యశాఖకు, ఆరోగ్యశ్రీకి నోటీసులిచ్చింది. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మరోవంక ఇవేమీ పట్టన్నట్లు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారులు ఇతర రాష్ట్రాలలో పర్యటనలు జరుపుతూ తీరిక లేకుండా ఉన్నట్లు తెలుస్తున్నది.

రాష్ట్రంలో 236 ప్రైవేటు నెట్‌వర్క్, 96 ప్రభుత్వ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. వీటికితోడు మరో 67 డెంటల్‌ నెట్‌వర్క్‌ ప్రైవేట్‌ ఆస్పత్రులున్నాయి. ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రం డెంటల్‌ వైద్య సేవలు అందవు. కేవలం ఈజేహెచ్‌ఎస్‌ రోగులకే డెంటల్‌ సేవలు అందజేస్తారు. అంటే రాష్ట్రంలో డెంటల్‌తో కలిపి ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ 303 ఆస్పత్రులున్నాయి. సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో శనివారం నుంచి అన్ని రకాల వైద్య సేవలూ నిలిపివేస్తున్నట్లు సంఘం పేర్కొంది.

నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రతీ రోజూ సరాసరి 10 వేల మంది ఓపీ, 3 వేల మంది ఇన్‌ పేషెంట్లు వస్తుంటారు. ఒక అంచనా ప్రకారం ఇన్‌పేషెంట్లుగా వచ్చే వారిలో ప్రతీ రోజు వెయ్యి మందికి వివిధ రకాల ఆపరేషన్లు జరుగుతాయి. ఆపరేషన్లను కూడా ఆపడం పేదలు, ఉద్యోగుల పాలిట శాపంగా మారనుంది.  

ప్రభుత్వం 12 నెలలుగా డబ్బులు విడుదల చేయడంలేదని, దీనితో బకాయిలు .రూ. 1,200 కోట్లకు పేరుకు పోయిన్నట్లునెట్‌వర్క్‌ ఆసుపత్రులు చెబుతున్నారు. అయితే అంతగా బకాయిలు లేవని, కేవలం రూ.350 కోట్లు మాత్రమే ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రెండ్రోజుల క్రితం రూ.150 కోట్లు విడుదల చేశామని, కాబట్టి ఇంకా రూ.200 కోట్లు మాత్రమే బకాయి ఉందని చెబుతున్నారు. రాజకీయపరమైన కారణాలతోనే నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఇలా వైద్య సేవలను నిలిపివేస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి.