తెలంగాణలో కీలక శక్తిగా బిజెపి : నడ్డా

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుందని, రెండంకెల స్థానాలను సాధిస్తామని, బిజెపి కీలకశక్తిగా అవతరిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి,  బిజెపి రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి జె.పి.నడ్డా భరోసాను వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాల ఎన్నికల ప్రచార సభలకు విశేషంగా ప్రజలు తరలి వస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా యువకులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల్ని మోసగించిందని, కేంద్ర నిధుల్ని సక్రమంగా వినియోగించకుండా దారి మళ్లించిందని నడ్డా ఆరోపించారు. తెలంగాణలో ఆయుష్మాన్‌భారత్‌ పథకాన్ని అమలు చేయకుండా పేదల ఆరోగ్యంతో రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు.

తెలంగాణ ఏర్పడ్డా పెద్దగా అభివృద్ధి జరగలేదు. అవినీతి పెద్దఎత్తున జరుగుతోంది. కేసీఆర్‌ తీరుపై, కుటుంబపాలనపై ప్రజలు విసుగెత్తిపోయారు. వారు మార్పు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.

తెలంగాణ కొత్త రాష్ట్రం. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్‌యోజన వంటి పథకాలకు కేంద్రం నిధులిచ్చినా  టీఆర్‌ఎస్ ప్రభుత్వం వినియోగించట్లేదని ధ్వజమెత్తారు. అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్నామని అంటూ ఇక్కడ కూడా బిజెపిని ప్రజలు ఆదరించాలని కోరారు. 

తెలంగాణలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తూనే అర్హులైన వారికి  అదనంగా ఆయుష్మాన్‌ భారత్‌ను కూడా అమలు చేసుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. దిల్లీ, ఒడిశా, తెలంగాణ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతోందని చెబుతూ రెండునెలల్లో దేశవ్యాప్తంగా 3.60 లక్షల మంది దీని ద్వారా వైద్యసేవలు పొందారని పేర్కొన్నారు.