అమరావతికి ముంపు ప్రమాదంతో రెడ్‌ అలర్ట్‌

కోస్తాంధ్రలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్ర తాత్కాలిక సచివాలయం ఏర్పరచిన అమరావతి ప్రాంతానికి ముంపు ప్రమాదం ఏర్పడింది. కృష్ణ నది ఒడ్డున, కొండవీటి వాగుతో ప్రతి సంవత్సరం ముపుకు గురయ్యే ఈ ప్రాంతంలో సచివాలయ నిర్మాణం తఃగాదని పర్యావరణ వేత్తలు వ్యక్తం చేస్తున్న ఆందోళనకు బలం చేకుర్చిన్నట్లు అవుతున్నది. దానితో అధికారులు అమరావతిలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.

భారీ వర్షాలతో అమరావతిలో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కొండవీటి వాగు ఉప్పొంగే అవకాశం ఉండటంతో రాష్ట్ర సచివాలయానికి వరదముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు. ముంపు ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం ఉండటంతో ఈ విషయంలో ఏం చేయాలనే  దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొండవీటి వాగు వరదను ఎటు మళ్లించాలనే దానిపై తర్జనభర్జన అవుతున్నారు. ప్రస్తుతం కొండవీటి వాగు వద్ద తాడికొండ పోలీసులు పహరా కాస్తున్నారు.

కాగా, రాయలసీమ, నెల్లూరు మినహా కోస్తా అంతటా నేడూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. కృష్ణాజిల్లాలో గడిచిన 24 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.  ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సోమవారం మూడు జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాలు నీటమునిగాయి. వర్షాల కారణంగా గోదావరి జిల్లాల్లో ఇద్దరు మృతిచెందారు. కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విశాఖ అర్బన్‌లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. బ్యారేజీ ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 70 గేట్లను ఎత్తేశారు. 65వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

భారీ వర్షాలతో రాజమండ్రిలోని గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు వచ్చిచేరడంతో ధవళేశ్వరం బ్యారేజ్‌ నీటి మట్టం 13అడుగులకు చేరింది. ఇప్పటికే 11లక్షల 63వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వరద ఉధృతి పెరిగిపోవడంతో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. పాపికొండల పర్యటనకు బోట్లను అనుమతించట్లేదు. పడవ ప్రయాణాలు నిషేధించడంతో రాకపోకలకు లంకగ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.