బికనీర్ డీల్‍‌పై రాహుల్ నోరుమెదపాలి

విచ్చలవిడి బ్యాంకు రుణాలు, నిరర్ధక ఆస్తులు పెరగడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలే కారణమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. రాజస్థాన్‌లోని నౌగౌర్ జిల్లా కుచమాన్ సిటీలోఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పద్ధతుల ద్వారా రుణాలు ఇవ్వడం వల్ల అవన్నీ నిర్ధరక ఆస్తులుగా మిగిలిపోయాయని దుయ్యబట్టారు. ఈ రుణలేవీ మోదీ ప్రభుత్వం ఇచ్చినవి కావని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన తప్పదాలే ఈ నిరర్ధక ఆస్తులు పేరుకుపోవడానికి కారణని అమిత్ షా విమర్శించారు. నెహ్రూ- గాంధీ కుటుంబ అల్లుడు ఓ పెద్ద కంపెనీకి వేల కోట్ల రూపాయలు రుణంగా ఇప్పించడం ద్వారా కమిషన్లు పొందారని ఆరోపించారు.

'వేల కోట్లు రుణాలు ఇప్పించిన కొద్ది నెలలకే వాద్రాకు కమిషన్లు చేరాయి. దాంతోనే 150 హెక్టార్ల భూమిని ఆయన బికనీర్‌లో కారుచౌకగా కొన్నారు. దీనికి రాహుల్ ఏం సమాధానం చెబుతారు?' అని అమిత్‌షా ప్రశ్నించారు. దేశం విడిచి పరారైన నగలవ్యాపారి నీరవ్ మోదీ, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాలకు యూపీఏ ప్రభుత్వంలోనే రుణాలిచ్చారని, కాంగ్రెస్ అంటే భయం లేనందునే యూపీఏ హయాంలో వారు దేశం వదలి పారిపోలేదని ఎద్దేవా చేశారు.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమను జైలుకు పంపుతారనే భయం నీరవ్, మాల్యాలకు పట్టుకుందని పేర్కొన్నారు. దేశం వదిలి పరారైన వారి నుంచి ప్రతి పైసా వసూలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని షా స్పష్టం చేశారు.