సిద్దరామయ్యే కాదు సోనియా కైనా బీజేపీ స్వాగతం !

కర్ణాటక బిజెపి అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్పవెళ్లి కర్ణాటక కాంగ్రెస్ నేత, మంత్రి డీకే శివకుమార్ ను కలసి నప్పటి నుండి కర్ణాటక రాజకీయాలలో ప్రకంపనాలు బయలు దేరుతున్నాయి. కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మనుగడ పట్ల మరోసారి అనుమానాలు చెలరేగుతున్నాయి. ఈ పర్యాయం కాంగ్రెస్ నుండి `పెద్ద తలకాయలే' వెళ్లి పోవడానికి సిద్ధపడుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య బిజెపిలోకి వస్తున్నారనే ప్రచారం చెలరేగడం కర్ణాటకలో రాజకీయ సంచలనాలకు ఆజ్యం పోస్తున్నది. పైగా ఈ ఆజ్యంపై నూనె పోసిన్నట్లుగా సిద్దరామయ్య కాకుండా సోనియా గాంధీ వచ్చి చేరతామన్నా బిజెపిలోకి సాదరంగా స్వాగతిస్తామని  బీజేపీ ముఖ్యనేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప పేర్కొనడటం కాంగ్రెస్ వర్గాలలో కలకలం రేపుతున్నది.

అయితే సిద్దరామయ్య లాంటివారు మాట మీద నిలబడేవారు కాదని పేర్కొంటూ అటువంటి  మరో మెలిక పెట్టారు. గతంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించారని, ఆ తర్వాత పోటీ చేస్తున్నట్లు చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికలకు దూరమని మరోసారి సీఎం పదవిని ఆశించడం లేదని చెప్పారని, కానీ ఇటీవలే మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఉందని ప్రకటించారని చెప్పారు. ఇలా ఎప్పటికప్పుడు మాటమార్చే సిద్దరామయ్య గురించి వ్యాఖ్యలు అనవసరమని కొట్టిపారేశారు.

ఈ విషయమై కాంగ్రెస్ లో చెలరేగిన కలవరాన్ని కప్పు పుచ్చుకోవడం కోసమై  మంత్రి డి.కె.శివకుమార్‌ బీజేపీలో చేరరని, యడ్యూరప్ప కాంగ్రెస్‌లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వెంకటరమణప్ప పేర్కొన్నారు.  ఇరువురి కలయిక పట్ల రాజకీయ దుమారం అనవసరమంటూ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు.

మరోవంక కాంగ్రెస్ లోని కలవరాన్ని మరింతగా పెంచే విధంగా రాష్ట్రంలోని అపవిత్ర కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడు ఇంటిదారి పడుతుందా? అని ప్రజలంతా వెయ్యికళ్ళతో ఎదరుచూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్‌.అశోక్‌ పేర్కొన్నారు.  సంకీర్ణ ప్రభుత్వం అట్టే ఎక్కువ కాలం మనుగడ సాగించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమని, రానున్న రోజుల్లో కన్నడ నాట రాజకీయ సమీకరణలు ఊహించని రీతిలో మలుపు తిరగనున్నాయని జోస్యం చెప్పారు. దానితో కొందరు కాంగ్రెస్ ప్రముఖులు బిజెపి వైపు చూస్తున్నట్లు సంకేతం ఇచ్చారు.

అనేక మంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు, ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్దంగా ఉన్నారని, అయితే ప్రజాస్వామ్య నైతిక విలువలపై ఉన్న గౌరవం కొద్ది ఇందుకు తాము ఆతృత పడటం లేదని అశోక్ తెలిపారు. ముఖ్యమంత్రి కుమారస్వామి ఇటీవల పదే పదే సహనం కోల్పోతూ నోరు జారుతున్నారని అంటూ ఇది మంచిది కాదని హితవు చెప్పారు.

రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలితే అందుకు బీజేపీ ఏమాత్రం బాధ్యత వహించబోదని  బిజెపి అధికార ప్రతినిధి సి.టి.రవి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు, ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ప్రయత్నించబోదని అంటూ స్వయంకృతాపరాదంతో కుప్పకూలితే అందుకు తాము కారణం కాబోమని తేల్చేశారు.  ప్రభుత్వం కుప్పకూలుతుందన్న భయంతోనే ఆరు నెలలుగా మంత్రివర్గ విస్తరణను చేపట్టే సాహసాన్ని ప్రభుత్వం చేయడం లేదని ఎద్దేవా చేశారు.