అర్జెంటీనాలో పలు కీలక భేటీలలో ప్రధాని మోదీ

అర్జెంటీనా వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు గురువారం బ్యూనస్‌ఏర్స్‌ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు కీలక భేటీల్లో పాల్గొన్నారు. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌తో విడివిడిగా చర్చలు జరిపారు.

‘సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో ఫలప్రదమైన చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు అంశాలపై చర్చించాం’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ భేటీ అనంతరం ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాతావరణ మార్పులపై ఇరువురు చర్చించారు.

కీలక భేటీల అనంతరం ఓ యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఆరోగ్యం, శాంతి కోసం ఈ ప్రపంచానికి భారత్‌ ఇచ్చిన బహుమతి యోగా అని, దీని వల్ల భారత్‌, అర్జెంటీనా మధ్య దూరాన్ని తగ్గిస్తోందని మోదీ చెప్పారు.

‘యోగా వల్ల మీ శరీరం, మనసు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. ఇది శరీరానికి బలాన్ని ఇవ్వడమే గాక.. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే కుటుంబం, సమాజం, దేశం, ప్రపంచం కూడా శాంతియుతంగా ఉంటాయి’ అని మోదీ పేర్కొన్నారు.

శుక్ర, శనివారాల్లో జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌లతోనూ మోదీ సమావేశం కానున్నారు. వ్యూహాత్మకమైన భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో ప్రాబల్యం పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మోదీ, ట్రంప్‌, జపాన్‌ అధ్యక్షుడు షింజో అబె మధ్య త్రైపాక్షిక భేటీ జరగనుంది.