జల ప్రళయం అంచున ఇక గోవా !

కేరళలో జల ప్రళయంను ముందుగానే హెచ్చరించిన ప్రముఖ పర్యావరణ వేత్త ఆచార్య మాధవ్ గాడ్గిల్ ఇప్పుడు గోవాకు సహితం అటువంటి హెచ్చరిక చేస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోనని పక్షంలో పర్యాటకుల స్వర్గధామమైన గోవాకు కూడా కుడా అదేతరహలో పెనుముప్పు పొంచి ఉందని పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ (డబ్ల్యూజీఈఈపీ) అధ్యక్షుడు మాధవ్ గాడ్గిల్ స్పష్టం చేసారు. పర్యావరణాన్ని పణంగా పెడుతూ చేపట్టే అభివృద్ధి వల్ల భవిష్యత్తులో భారీ వినాశనం తప్పదని వారించారు.

 

గోవాలో భారీస్థాయిలో చేపడుతున్న అక్రమ మైనింగ్ వల్ల ఆ రాష్ట్రం మూల్యం చెల్లించుకోకతప్పదని స్పష్టంచేశారు. ఈ విపత్తులకు మానవ తప్పిదాలే కారణమని పేర్కొన్నారు. పశ్చిమ కనుమల పరిరక్షణపై సిఫార్సులు చేయడానికి డబ్ల్యూజీఈఈపీని మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలో కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 2011లో తన నివేదికను సమర్పించింది. పశ్చిమ కనుమల్లో మైనింగ్, స్టోన్‌క్రషర్స్ నిర్వహణ, ఇతర కార్యక్రమాలు చేపట్టరాదని సూచించింది.

కేరళలో భవిష్యత్తులో సంభవించే భారీ విలయాన్ని గాడ్గిల్ 2011లోనే ఊహించి ప్రభుత్వాల్ని హెచ్చరించారు. తాజాగా కేరళలో ప్రకృతి ప్రకోపంపై గాడ్గిల్ స్పందిస్తూ ప్రస్తుత విపత్తులకు ప్రధాన కారణం పశ్చిమ కనుమల్లో పర్యావరణాన్ని నాశనం చేయడమే అని  తెలిపారు.

గోవాలో అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని పణంగా పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. భవిష్యత్తులో గోవా కూడా కేరళ లాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనకతప్పదని స్పష్తం చేసారు. గోవాలో రూ.35వేల కోట్ల మేర అక్రమ మైనింగ్ సాగుతున్నదని కేంద్రం నియమించిన జస్టిస్ ఎంబీ షా కమిషన్ తన నివేదికలో స్పష్టంచేసింది. కానీ, దీనిపై చర్యలు తీసుకోలేదు అని ఆయన వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లే విపత్తులు తలెత్తుతున్నాయని తెలిపారు.