కులగోత్రాల పేరుతో రాహుల్ రాజకీయం

బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక కులం, గోత్రంపేరుతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజకీయాలు చేస్తున్నారని, విధానాలపై కాకుండా ప్రధాని నరేంద్రమోదీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. నాగర్‌కర్నూల్ లో బీజేపీ అభ్యర్థి దిలీపాచారికి మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార బహిరంగ సభలో మాట్లాడుతూ  ప్రధాని నరేంద్రమోదీ విధానాలతో దేశ ప్రతిష్ట, గౌరవం ప్రపంచంలో రోజురోజుకు పెరిగిపోతుండగా, ప్రతి నిత్యం అసత్య ఆరోపణలు ప్రచారం చేసుకుంటూ చివరకు కులం, గోత్రం పేరుతో రాహుల్‌గాంధీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

ఆధునిక భారతదేశంలో కులం, మతం, గోత్రం ఎక్కడిదని, నా కులం దేశాభివృద్ది అని, నా గోత్రం భారత సంస్కృతి సంపదని చెబుతానని స్పష్టం చేసారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టే సమయంలో దేశంలో విషమపరిస్థితులు ఉండేవని, 90 జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేదని, ఈశాన్య రాష్ట్రాలలో చొరబాటుదారులు, దేశద్రోహులు ఉండేవారని గుర్తు చేశారు. ఈ నాలుగున్నర ఏళ్లలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని 60 జిల్లాలకు తగ్గించామని, ఈశాన్య రాష్ట్రాలలో చొరబాటులను, దేశద్రోహులను 80శాతం అరికట్టామని పేర్కొన్నారు.

యుపీఎ ప్రభుత్వ హయాంలో ఆర్థికాభివృద్దిలో ప్రపంచంలో 10వ స్థానంలో ఉంటే తాము 6వ స్థానంలోకి తెచ్చామని, త్వరలోనే ఐదోస్థానం సాధించబోతున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ అవలంబిస్తున్న విధానాలతో దేశంలో పేదరికం క్రమేణా తగ్గుతోందని, ద్రవ్యోల్బణం కూడా తగ్గి నిత్యావసర సరుకుల ధరలు పెరగడం లేదని తెలిపారు. దేశంలో పేదరికం నిర్మూలన, రైతులు ఆర్థికంగా బలోపేతం చేయడమే బీజేపీ లక్ష్యమని చెబుతూ 2022 నాటికి ప్రతి రైతు ఆదాయం రెట్టింపు చేయాలనే సంకల్పంతో తాము పని చేస్తున్నామని వెల్లడించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆలు పరిశ్రమ, జిల్లాకో మొబైల్ పరిశ్రమ పెడుతామని రాహుల్ అంటున్నారని, ఆలుగడ్డ భూమిద్వారా పండుతుందనే విషయం కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. నాడు యూపీఏ ప్రభుత్వంలో రెండు మోబైల్ పరిశ్రమలు ఉంటే నేడు 120 మోబైల్ పరిశ్రమలు ఉన్నాయని, ఎవరి పనితీరు ఎలా ఉందో గుర్తించాలని కోరారు. జమ్ముకాశ్మీర్‌లో వేర్పాటువాదుల ఆటలను కట్టివేశామని, నేడు రోజు ఐదారుగురు చొరబాటుదారులు ఎన్‌కౌంటర్లలో చనిపోతున్నారని తెలిపారు.

నరేంద్రమోదీ ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచేందుకు వివిధ పథకాలను చేపట్టి అమలుచేస్తుంటే వాటిని తెలంగాణలో వాటిని అమలుచేయకుండా ప్రజల సంక్షేమాన్ని కేసీఆర్ విస్మరించిందని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం పని చేస్తే ఈ నాలుగున్నర ఏళ్లలో 4500 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో సీఏం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతులు గిట్టుబాటు ధర అడిగితే వారికి సంకెళ్లు వేశారని ఇదేనా రైతు సంక్షేమం? అని ప్రశ్నించారు. ఎపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన అభివృద్ధిలో ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు.

రాజ్యాంగానికి విరుద్ధంగా మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఓట్ల కోసం మతాలు, కులాలు, ప్రాంతాలవారీగా ప్రజలను విభజిస్తూ వారిలో వైషమ్యాలను సృష్టిస్తున్నారని చెప్పారు.

ఇడిపి, కాంగ్రెస్‌ల అపవిత్ర కలయిక అభివృద్ధి కోసం కాదని..మోదీని అడ్డుకోవడానికేనని రాజనాథ్ సింగ్ మండిపడ్డారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని, కాంగ్రెస్‌తో స్నేహం వల్ల చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు.