ఫ్రెంచ్ జర్నలిస్టుల కదలికలపై అనుమానాలు

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా మనవలకురిచ్చిలో ఉండే భారత అరుదైన ఖనిజాల సంస్థకు చెందిన పరిసరాలలోకి ఇద్దరు ఫ్రెంచ్ జర్నలిస్టులు ఇటీవల అనుమతి లేకుండా ప్రవేశించడమే కాకుండా ఫొటోలు కూడా తీసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు వారెందుకు వచ్చారనే విషయమై నిఘా సంస్థలు కుపీలాగే ప్రయత్నం చేస్తున్నాయి.

వారిపేర్లు ఆర్థర్ రోలాండ్ రెనే, జూల్స్ డేమియన్. వారు పరిశోధనాత్మక పాత్రికేయులుగా పనిచేస్తున్నారు. టూరిస్టు వీసాలపై వారు దేశాలు తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీస్తారు. యూరప్‌లోని టీవీ చానెల్స్‌కు వాటిని సరఫరా చేస్తారు. బీచ్ ఇసుక తవ్వకంపై స్టోరీ చేసేందుకు వారు కన్యాకుమారికి వచ్చినట్టు జిల్లా ఎస్పీ ఎన్ శ్రీనాథ్ చెప్పారు.

పోలీసులకు సమాచారం అంది వారు వచ్చేలోగా ఇద్దరు ఫ్రెంచ్‌జాతీయులు చల్లగా దేశం నుంచి జారుకున్నారు. దాంతో వారిని ప్రశ్నించడం సాధ్యపడలేదు. వారికి స్థానిక చర్చి పాస్టరు ఫాదర్ హిల్డాస్, కోంబత్తూరుకు చెందిన ఫ్రీలాన్స్ టీవీ విలేకరి అనంతకుమార్ వారికి గైడ్లుగా వ్యవహరించారు. విలేకరితో పాటు శ్రీరామ్ అనే మరోవ్యక్తి కూడా సరదాగా వెంటవచ్చాడు.

నవంబర్ 23న కన్యాకుమారి చేరుకున్న ఫ్రెంచ్ జాతీయులు వివిధ ప్రదేశాల్లో వీడియోలు తీశారు. నవంబర్ 26న (సోమవారం) నిషేధిత ప్రాంతం అని రాసి ఉన్న అరుదైన లోహాల సంస్థ పరిసరాల్లోకి ప్రవేశించారు. సాధారణ ప్రజానీకానికి, విశేషించి విదేశీయులకు అక్కడ ప్రవేశించడానికి అనుమతి లేదు. ఐఆర్‌ఈ సిబ్బంది అప్రమత్తం చేయడంతో పోలీసులు అక్కడి చేరుకున్నారు. కానీ అప్పటికే ఫ్రెంచ్ జాతీయులు పరారయ్యారు.

ముందుగా తిరువనంతపురం విమానాశ్రయం, అక్కడ నుంచి మరో దేశీయ విమానాశ్రయానికి చేరుకుని ఫ్రాన్స్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం వారికి తోడ్పడ్డ స్థానికు పాస్టర్‌ను, విలేకరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.