హరిద్వార్‌ వద్ద వాజ్‌పేయి చితాభస్మం నిమజ్జనం

మాజీ ప్రధాని వాజపేయి చితాభస్మాన్ని హరిద్వార్‌లోని ప్రఖ్యాత హరీ-కి-పౌరి (బ్రహ్మకుండ్) ఘాట్ వద్ద వేదఘోష మధ్య గంగాజలాల్లో నిమజ్జనం చేశారు. వాజపేయి దత్తపుత్రిక నమిత కౌల్ భట్టాచార్య చేతుల మీదుగా ఈ నిమజ్జనం జరిగింది. వాజపేయి మనుమరాలు నీహారికా, పలువురు కుటుంబసభ్యులుసహా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ చీఫ్ అమిత్‌షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి  త్రివేంద్రసింగ్ రావత్ నమిత భట్టాచార్య వెంట ఉన్నారు.

హరిద్వార్‌లో అస్తికలను కలిపే ముందు వారు ప్రేమ్ ఆశ్రమ్‌ను సందర్శించారు. అంతకుముందు ఉదయమే న్యూఢిల్లీలోని స్మృతిస్థల్ నుంచి వాజపేయి చితాభస్మాన్ని మూడు కలశాల్లో నమిత, ఆమె కుమార్తె నీహారిక సేకరించి డెహ్రాడూన్ తీసుకొచ్చారు. స్థానిక భల్లా కళాశాల మైదానం నుంచి మొదలైన ఆస్థికల నిమజ్జనయాత్రకు వేలాది మంది హాజరై అటల్‌జీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి అస్తి కలశ్ యాత్ర ప్రారంభమైంది.

ఉత్తరప్రదేశ్‌లోని గంగానదితోపాటు యమున, తపతి నదుల్లో కూడా వాజపేయి అస్థికలను నిమజ్జనం చేయనున్నారు. రాష్ర్టాల రాజధానులు, జిల్లా కేంద్రాల్లో ప్రార్థనాసమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20 న ఢిల్లీలో అఖిలపక్ష ప్రార్థనా సమవేశం, 21 న లక్నోలో ప్రత్యేకంగా అస్థికల ప్రదర్శన కార్యక్రమం చేపట్టనున్నారు.