చంద్రబాబే ప్రధాని అంటూ తెలంగాణాలో నినాదాలు

నాలుగేళ్ళుగా తెలంగాణలో ఒక్క బహిరంగ సభలో ప్రసంగించడానికి కూడా సాహసించని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ నీడలో తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలలో ఉత్సాహానికి అంతు ఉండటం లేదు. కాంగ్రెస్ 14 సీట్లు ఇస్తే, అబ్బే అన్ని సీట్లు ఎందుకు అన్నట్లు 12 సీట్లలోనే అభ్యర్ధులను నిలబెట్టిన చంద్రబాబు తాను `తెలంగాణ వ్యతిరేకి’ అని ఇక్కడ ప్రజలలో బలంగా నెలకొన్న అభిప్రాయాన్ని తొలగించడం కోసం విఫల ప్రయత్నం చేస్తున్నారు.

`బంగారు తెలంగాణ’ కావాలని కోరుకొంతున్నానని చెబుతూ స్థానిక ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాను తగాదా పెట్టుకోక పోయినా, ఒక్క మాట అనక పోయినా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ నేతలు తననే లక్ష్యంగా ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారో అర్ధం కావడం లేదంటూ ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలో `కాబోయే ప్రధాని చంద్రబాబు’ అంటూ నినాదం ఇవ్వ్వడం, దానితో ఆయన ముసి, ముసిగా నవ్వుకోవడం ఇతర పార్టీలకు వింతగా తోస్తున్నది.

ప్రధాన మంత్రి పదవి చేపట్టడం కోసం ఇతర పార్టీలు ఏవీ తన నాయకత్వాన్ని ఒప్పుకోవడానికి సిద్దం కాని పక్షంలో కేంద్రంలో ఏదో, ఒక తోడు కావలనుకొంటున్న చంద్రబాబు ఇప్పుడు `కొండంత అండగా’ కనిపించిన్నట్లున్నారు. అందుకనే ఖమ్మంలో తొలిసారి చంద్రబాబుతో కలసి వేదికను పంచుకోవడంతో రాహుల్ సహితం పులకించి పోతున్నారు. కర్ణాటకలో తప్ప దేశంలో మరెక్కడా ఆయనతో కలసి వేదికను పంచుకోవడానికి మరే ప్రముఖ నాయకుడు ముందుకు రాకపోవడం గమనార్హం.

అయితే చంద్రబాబును అడ్డుగా పెట్టుకొనే రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని కాంగ్రెస్ నేతలు ముచ్చట పడుతూ ఉంటె “చంద్రబాబే ప్రధాని” అంటూ ఖమ్మంలో సభలో కుడా టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వడంతో విస్తు పోతున్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరిపిన రోడ్‌షోలో  చంద్రబాబు ప్రసంగిస్తూ ఉంటే చంద్రబాబు ప్రధాని అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే వద్దని వారిని వారిస్తూ,ప్రధాని పదవిపై ఆశ లేదని చెబుతున్నా ఆయన మోహంలో ఆ నినాదాల పట్ల ఒక వెలుగు కనిపించడాన్ని పార్టీ కార్యకర్తలు గమనిస్తూనే ఉన్నారు.

దానితో మమత బెనర్జీ, శరద్ పవర్ ల దగ్గర నుంచి దేవగౌడ వరకు `హంగ్ పార్లమెంట్’ ఏర్పడితే 20, 30 మంది ఎంపిల మద్దతుతో కుడా గతంలో దేవగౌడ, ఐ కె గుజ్రాల్ ల వలే తాను కుడా ఒకసారి ప్రధాని కావచ్చనే ఆశలు చంద్రబాబులో సహితం మొగ్గు చూపుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. గతంలో ఎప్పుడు టిడిపి కార్యకర్తలు ఇటువంటి నినాదాలు ఇవ్వక ప్వోఅడం గమనార్హం.