కలకలం రేపుతున్న శివకుమార్ తో యడ్యూరప్ప భేటి

కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్యెల్యేలు జారిపోకుండా కట్టడి చేయడంతో పాటు ఈ మధ్య బళ్ళారి ఉపఎన్నికలో అనూహ్యంగా పార్టీ అభ్యర్ధి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర వహింఛి, ఎప్పటికప్పుడు సంకీర్ణ ప్రభుత్వం కులిపోకుండా అడ్డుకొంటూ వస్తున్నా భారీ జలవనరుల శాఖ మంత్రి నేత డి.కె.శివకుమార్‌ నివాసానికి రాష్ట్ర ప్రతిపక్షనేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి. ఎస్.యడ్యూరప్ప వెళ్లడం కర్ణాటక రాజకీయాలలో కలకలం రేపుతున్నది. సహకారనగర్‌లోని డి.కె.శివకుమార్‌ నివాసానికి ఇరువురు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలసి వెళ్ళారు. ఇరువురు 20 నిమిషాలకుపైగా రహస్యంగా చర్చలు జరుపుకొన్నారు.

రాష్ట్రంలో మే నెలలో శాసనసభ ఎన్నికలు జరుగగా బీజేపీకి 104సీట్లు దక్కాయి. అయితే కాంగ్రెస్‌, జెడిఎస్ లు పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పటినుంచి బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య మరింత అగాథం ఏర్పడింది. మంత్రి డి.కె.శివకుమార్‌కు వ్యతిరేకంగా యడ్యూరప్ప పలుమార్లు భారీ విమర్శలు చేయగా అందుకు దీటుగా డి.కె.శివకుమార్‌ కూడా స్పందించారు. అలా ఉప్పు నిప్పులాగా ఉన్న ఇరువురు నేతలు కలిసి రహస్యంగా ఏం మాట్లాడుకున్నారనేది కీలకంగా మారింది.

రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర వహించిన శివకుమార్ ప్రాధాన్యత తగ్గించే విధంగా తొలి నుండి ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యవహరిస్తున్నారు. ఆయనకు కోరిన మంత్రిత్వ శాఖ ఇచ్చే విషయం నుండి, ఆయన మద్దతుదారులకు పదవులు కట్టబెట్టడంలో కుడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. శివకుమార్ ఎదుగుదలకు వీలు చిక్కినప్పుడల్లా ప్రతిబంధకంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి సమయంలో వీరిద్దరి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నది.

ఏడాది కాలంగా మంత్రి డి.కె.శివకుమార్‌పై ఐటి, ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. పలుమార్లు నేరుగా ఐటి అధికారులే పార్టీ ఫిరాయించాలని కోరినట్లు డి.కె.సోదరుడు, బెంగళూరు గ్రామీణ ఎంపీ డి.కె.సురేశ్‌ వెల్లడించారు. ఉపఎన్నికలలో చెప్పుకోదగిన విజయం సాధించడంలో ఇప్పట్లో సంకీర్ణ ప్రభుత్వానికి ధోకా లేదనే భరోసా వ్యక్తం అవుతున్న సమయంలో వీరిద్దరి భేటి ఆసక్తి కలిగిస్తున్నది. మరో ఐదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో డి.కె.శివకుమార్‌ను బీజేపీలోకి ఆహ్వానించడానికి కమలనాథులు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఈ ఎత్తుగడలో భాగంగానే బీజేపీ అగ్రనేతల సలహాతో డి.కె. నివాసానికి యడ్యూరప్ప వెళ్ళినట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

అటువంటిదేమీ లేదని బీజేపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వంలో బలమైన నాయకుడిగా డి.కె.శివకుమార్‌ ముద్ర వేసుకున్నారు. తాజాగా నాలుగు రోజులక్రితం సంకీర్ణ ప్రభుత్వానికి ఢోకా లేకుండా చూడాల్సిన బాధ్యత నీదేనంటూ తెలంగాణ రాష్ట్రం మెదక్‌ సభలో సోనియాగాంధీ సూచించగా, ఇక రాహుల్‌గాంధీ ఏకంగా ఐదు నిమిషాలపాటు రహస్యంగా మాట్లాడారు. దీన్ని బట్టి చూస్తే డి.కె కాంగ్రెస్ పార్టీలో అసహనంగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది.

దీనిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇటీవల కెఎల్‌ఇ విద్యాసంస్థల సువర్ణ మహోత్సవంలో సంస్థల ముఖ్యులు, బీజేపీ కీలక నేత ప్రభాకర్‌ కోరె రాష్ట్రానికి త్వరలోనే డి.కె.శివకుమార్‌ ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయని బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలోనే డి.కె.శివకుమార్‌తో యడ్యూరప్ప భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే శివమొగ్గ జిల్లా సాగర్‌ నియోజకవర్గ పరిధిలోని సిగందూరులో బ్రిడ్జి నిర్మాణం పనులపై చర్చించేందుకు మాత్రమే డి.కె.శివకుమార్‌ను కలసినట్లు యడ్యూరప్ప మీడియాకు వెల్లడించారు.

శివమొగ్గ ఎంపీ బి.వై.రాఘవేంద్ర, రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్‌ కోరె, ఎమ్మెల్యే హర్తాళు హాలప్పలతో కలసి శివమొగ్గకు సంబంధించిన జలవనరుల పనులపై చర్చించేందుకు వెళ్ళినట్లు వివరించారు. గతంలో ఇటువంటి అంశాలపై యడ్యూరప్ప ఆయనకు లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయి. కానీ డి.కె.శివకుమార్‌ను నివాసానికి వెళ్ళి రహస్యంగా చర్చించడం జరగలేదు. తన నివాసానికి వచ్చిన యడ్యూరప్పకు పుష్పగుచ్ఛాలు అందించి డి.కె.శివకుమార్‌ స్వాగతించారు.