తెలంగాణలో కమలం వికసించడం ఖాయం

తెలంగాణలో ఎన్నికల తర్వాత కమలం పార్టీ వికసించడం ఖాయమని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ధీమా వ్యక్తం చేసారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రజలు బిజెపి పట్ల అమితమైన ఆదరణ చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఇది తెలంగాణలో విజయానికి సంకేతమని వ్యాఖ్యానించారు.

 రానున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న తెలంగాణలో బిజెపి మొదటిసారిగా కాషాయ జెండాను ఎగరవేయబోతోందని భరోసా వ్యక్తం చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్, మునుగోడు తదితర సెగ్మెంట్లలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభల్లో పాల్గొనడంతో పాటు హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు.  ఎంతోమంది బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్‌తో కెసిఆర్ ఎలా జతకట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా  డిమాండ్ చేశారు.

రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిందని తెలిపారు.  తెలంగాణ రాష్ట్రానికి యుపిఏ ప్రభుత్వం రూ.16 వేల కోట్లు ఇస్తే బిజెపి ప్రభుత్వం రూ.2.30 లక్షల కోట్లను ఇచ్చిందని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలుకాకుండా టిఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటని అమిత్‌షా విమర్శించారు.

మహాకూటమి పేరుతో కొన్ని పార్టీలన్నీ పగటి వేషగాళ్ళుగా కలిసి ప్రజల ముగింటకు వస్తున్నాయని అంటూ వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఓట్ల కోసం ప్రజలను మోసం చేసేందుకు కూటమి నాయకులు ఏ స్థాయికైనా దిగజారుతారని, అలాంటి వారికి ఓటుతోనే సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆదిలాబాద్‌లో బహిరంగ సభను ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్‌షా సాయంత్రం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్‌తో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్డుషోలో పాల్గొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రాంనగర్ చౌరస్తా నుంచి మొదలైన ఈ రోడ్‌షో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి మీదుగా ముషీరాబాద్, అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ సాగింది. అయితే రోడ్‌షాలో ఎలాంటి ప్రసంగాలు చేయకుండా అమిత్‌షా ప్రజలకు అభివాదం చేస్తూ కొనసాగించారు. రోడ్‌షో కారణంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.