కొడుకును సిఎం చేయలేమనే ముందస్తు

పార్లమెంటు ఎన్నికలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే గెలువలేమని, కొడుకును సీఎంను చేయలేమన్న భయంతోనే టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాల్టీ పరిధిలోని తంగడపల్లి ముస్కు మధుసూదన్‌రెడ్డి స్టేడియంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటూ  కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోతామన్న భయంతో కేసీఆర్ ఎనిమిది నెలల ముందే ప్రజలపై భారం వేస్తూ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని ధ్వజమెత్తారు.

మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుల రాష్ట్రంగా మార్చిండని ఎద్దేవా చేసారు. 12 శాతం ముస్లీం రిజర్వేషన్‌ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే అంగీకరించలేదని గుర్తు చేసారు. ముస్లీంలకు రిజర్వేషన్‌లు ఇవ్వం, ఇవ్వనివ్వమని షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చిన తమ కాళ్ల వద్ద పడి ఉండాల్సిందేనని ఎంఐఎం నేతలు చెబుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి తెలంగాణను వారి కాళ్ల వద్ద పెడుదామా అన్ని అభిమానులను ప్రశ్నించారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయిందని, ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్ట్లు  కనుమరగయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతూ తప్పని పరిస్థితుల్లో కూటములు కడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని ద్వజమెత్తారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న జనసంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కేంద్రం పేదల కోసం కోటిన్నర ఇళ్లు నిర్మిస్తే రాష్ట్రం వినియోగించుకోలేదని విమర్శించారు. ఆయుష్మాన్ ఆరోగ్య పథకాన్ని మోదీ ప్రభుత్వం అమలు చేస్తే దేశంలో మూడున్నర లక్షల మంది వినియోగించుకున్నారని గుర్తుచేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నరేళ్లలో నాలుగున్నర వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెబుతూ సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే 135 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. ఫ్లోరైడ్ పరిష్కారానికి, బాధితులను ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. బీజేపీకి అవకాశమిస్తే మునుగోడును అభివృద్ధి చేస్తాం, ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం, ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాన్ని పూర్తి చేస్తాం, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసే నక్కలగండి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం కమీషన్‌ల కోసం తాత్సారం చేసిందని విమర్శించారు. బీజేపీని గెలిపిస్తే నక్కలగండిని పూర్తి చేస్తామని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు.