మజ్లీస్‌ భాషలానే.. కేసీఆర్‌ భాష ఉందని సుష్మా మండిపాటు

తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకునే బీజేపీ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తెలంగాణలో పర్యటిస్తున్న సుష్మా స‍్వరాజ్‌ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయం నాటి పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు.

తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న మజ్లీస్‌.. నేడు టీఆర్‌ఎస్‌తో కలిసిందని విమర్శించారు. దేశ ప్రధానిపై కేసీఆర్‌ వాడే భాష ఎలాంటిందో ఒకసారి ఆలోచించుకోవాలని కోరారు. మజ్లీస్‌ భాష ఎలా ఉందో కేసీఆర్‌ భాష అలానే ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ చెప్పినట్టు తెలంగాణ ఎక్కడ లండన్‌ అయిందో.. ప్రజలే సమాధానం చెప్పాలని కోరారు.

బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని అంటూ కేవలం బీజేపీ మాత్రమే తెలంగాణకు ఎలాంటి షరతులు లేకుండా మద్దతు తెలిపిందని స్పష్టం చేసారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో అనేక మంది ఆహుతి అయ్యారని చెబుతూ `తెలంగాణలో బలిదానాలు ఆపటానికి పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణ చూడటానికి బతకాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశాను. అమరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో నేడు వారి సంఖ్యను తక్కువ చేసి చూపడం బాధకరం’ అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

రాష్ట్రం కోసం రెండు వేల మంది యువత బలిదానం చేస్తే కనీసం వారిని గుర్తించే స్థితిలో కూడా కేసీఆర్‌ ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరమని ద్వజమెత్తారు. మొక్కుబడిగా 400 మందిని గుర్తించి చేతులు దులిపేసుకున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేవలం కేసీఆర్‌ కుటుంబంలోని ఐదుగురు మాత్రమే పాల్గొన్నారా?అని ప్రశ్నిస్తూ  ఉద్యమం కోసం త్యాగాలు చేసిన వారికి ఏమి దక్కలేదని విచారం వ్యక్తం చేసారు.  యువతకు ఉద్యోగాలు రాలేదు గానే కేవలం కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేసారు.

కాగా, బిజెపికి టీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందం లేదని సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. ఇది తెలంగాణనా.. కేసీఆర్‌ రాజ్యమా? అని ప్రశ్నిస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో నెలకొన్న పరిస్థితి ఇప్పుడు లేదని, తెలంగాణను అడ్డుకున్నవారితో కలిసి టీఆర్‌ఎస్‌ పనిచేస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం లేదని సుష్మా స్పష్టం చేశారు.

ఇలా ఉండగా, తెలంగాణ నిర్మాణం జరగాలంటే రాష్ట్ర ప్రజలు బీజేపీకి పగ్గాలు అందించాలని, అప్పుడే వారికి మేలు జరుగుతుందని చెప్పారు.