రాజ్యసభలో బలం వస్తే రామమందిరం !

పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ తగినంత బలం సంపాదిస్తే రామ మందిర నిర్మాణానికి చట్టం తెచ్చే ఆలోచన కూడా చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చట్టం తీసుకురావడం తప్ప మరో దారి లేదని స్పష్టం చేసారు.  అది కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీకి తగినంత మెజార్టీ ఉన్నపుడు మాత్రమే సాధ్యమవుతుందని మౌర్య స్పష్టంచేశారు.

ప్రస్తుతం పార్లమెంట్‌లో తమకు తగినంత బలం లేదని చెబుతూ లోక్‌సభలో ఈ బిల్లును తీసుకొచ్చినా రాజ్యసభలో తగినంత మెజార్టీ లేదని గుర్తు చేసారు.  అక్కడ ఆ బిల్లు కచ్చితంగా ఓడిపోతుందని ప్రతి రామభక్తుడికి ఇది తెలుసు అని మౌర్య చెప్పారు. ఇక కోర్టు కూడా త్వరలోనే దీనిపై తీర్పు వెలువరించబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేసారు.

ఉభయ సభల్లో తమకు మెజార్టీ వచ్చినపుడు దానిని కచ్చితంగా వినియోగించుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయబోమని కేశవ్ ప్రసాద్ స్పష్టంచేశారు. రామమందిరం నిర్మించినపుడే వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్, మహంత్ శ్రీ రామచంద్ర దాస్ పరమహంస, బలిదానాలు చేసిన కరసేవకులకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని మౌర్య తెలిపారు.