కాంగ్రెస్ రాజకీయాలకు ఇంటిపేరే ముఖ్యం

కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేసేందుకు ఇంటిపేరునే ప్రధానంగా తీసుకుంటున్నదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మండిపడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు అనామక తల్లిదండ్రుల కొడుకైన నరేంద్ర మోదీకి, తమ తల్లిదండ్రుల కారణంగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి (రాహుల్‌గాంధీ)కి మధ్య జరుగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటే ఆ సవాల్‌ను స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసారు.

వంశపారంపర్య పార్టీ అయిన కాంగ్రెస్‌లో ప్రతిభకు, యోగ్యతకు స్థానం లేదని, ఆ కుటుంబం చుట్టూ ఉండే వారే కార్యకర్తలని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సర్దార్ పటేల్ తండ్రి ఎవరు? శీర్షికన జైట్లీ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కొందరు కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ తల్లిదండ్రుల గురించి ప్రస్తావించిన నేపథ్యంలో జైట్లీ తన ఫేస్‌బుక్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ వంశపారంపర్య ప్రజాస్వామ్యంగా ఉండాలా అన్న చర్చను కాంగ్రెస్ లేవదీసింది.

ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన వారై ఉండటం రాజకీయాలకు ముఖ్యమని ఆ పార్టీ వాదిస్తున్నది. కాంగ్రెస్ నాయకత్వం పెట్టే ఈ పరీక్షలో అనామక కుటుంబాల నుంచి వచ్చిన కోట్ల మంది ప్రతిభ గల రాజకీయ కార్యకర్తలు ఫెయిల్ అవుతారు. ప్రతిభ, యోగ్యత, స్ఫూర్తి కలిగించి, నడిపించే సామర్థ్యం ఉన్న వారు అవసరం లేదు.  కేవలం ఇంటిపేరు గొప్పదైతే చాలని కాంగ్రెస్ భావిస్తున్నది అని జైట్లీ విమర్శించారు.

మహాత్మాగాంధీ తండ్రి పేరు, సర్దార్ పటేల్ తండ్రి లేదా ఆయన భార్య పేరు అడిగినప్పుడు ఎంతో విద్యావంతులైన తన స్నేహితులే చెప్పలేకపోయారని జైట్లీ పేర్కొన్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కాలనీలు, ప్రాంతాలు, నగరాలు, వంతెనలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, స్టేడియాలకు ఒకే కుటుంబానికి చెందిన వారి పేర్లు పెట్టారని, ఈ దేశపు రాజీవంశీకులు గాంధీలు మాత్రమేనని ప్రకటించడం వారి ఉద్దేశమని జైట్లీ ఆరోపించారు

స్వాతంత్య్రోద్యమంలో సర్దార్ పటేల్ ముందువరుసలో ఉన్నారని, ఆయన ఈ దేశానికి ఉపప్రధానిగా, హోంమంత్రిగా పనిచేశారని, బ్రిటిష్‌వారితో అధికార బదిలీ కోసం చర్చలు జరిపారని, అయినప్పటికీ ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ఆయన విగ్రహం పెట్టాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరించిందని జైట్లీ చెప్పారు.