ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన టీ.కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. ప్రజా మేనిఫెస్టో పేరుతో 37 అంశాలతో రూపొందించిన మేనిఫెస్టోని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేష్, ఇతర నేతలు కలిసి తెలంగాణ‌ భవన్‌లో విడుదల చేశారు. 112 పేజీలతో రూపొందించిన ఈ మేనిఫెస్టోలో ప్రజలను ఆకర్షించే ఎన్నో పథకాలను పొందుపర్చారు. వ్యవసాయం, విద్య, యువతకు ఉపాధి, నీటిపారుదల రంగాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

సుపరిపాలనతో మొదలుకుని రైతులు, యువత, వైద్యరంగాల సంక్షేమంతో పాటు పలు కీలకమైన అంశాలను ప్రధానంగా ప్రణాళికలో పేర్కొంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని, ప్రతీ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. నిజాం వారసత్వ సంపదగా భావించే ఉస్మానియా ఆసపత్రిని కాపాడుకుంటామని పేర్కొంది.

మేనిఫెస్టోని ప్రధాన అంశాలు...

 • ‘జయజయహే తెలంగాణ' గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం
 • రాష్ట్ర కోడ్‌ 'టీఎస్‌'ను 'టీజీ'గా మార్పు
 • రైతులకు ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌. కౌలు రైతులకు కూడా రైతుబంధు అమలు. పంటలకు మద్దతు ధర కల్పించడం. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
 • ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులపై కేసులన్నీ ఎత్తివేత. అన్ని జిల్లాల్లో అమరవీరుల స్థూపాలు. అమరవీరుల కుటుంబాలు రూ.10 లక్షల ఆర్థిక సాయం. ఉచిత బస్‌ పాస్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.
 • అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో ఎన్‌ఆర్‌ఐ పాలసీ. గల్ఫ్‌ కార్మికుల కోసం ఏటా రూ.500కోట్లు
 • యువతకు రూ.3వేల నిరుద్యోగ భృతి. ఏడాదిలో లక్షల ఉద్యోగాల భర్తీ. 20వేల పోస్టులతో మెగా డీఎస్సీ. నియామకాలకు వార్షిక క్యాలెండర్.
 • అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ల పాత బకాయిలను చెల్లిస్తాం!
 • 100శాతం అక్షరాస్య సాధించాలని లక్ష్యం.
 • విద్యార్థులందరికీ బోధన రుసుం చెల్లింపు.
 • అన్ని వ్యాధులకు రూ.5లక్షల వరకూ ఆరోగ్యబీమా అందజేస్తాం.
 • ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 1000 పడకల వైద్యశాల ఏర్పాటు చేస్తాం.
 • సొంత స్థలం ఉంటే రూ.5లక్షలు ఆర్థిక సాయం చేస్తాం.
 • ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని వారసత్వం సంపదగా గుర్తింపు.
 • కాంగ్రెస్‌ పాలనలో జవాబుదారీతనం తీసుకొస్తాం.
 • స్థానిక సంస్థలకు అధికారాలు, గ్రామ పంచాయతీ, డీఆర్‌డీఏ, నరేగా, సెర్ఫ్, కార్మిక ఉద్యోగులను క్రమబద్దీకరిస్తాం.
 • ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు రూ.300 నుంచి 500 వరకు స్కాలర్ షిప్స్.