ప్రధాని మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం !

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించడానికి పాకిస్థాన్ సిద్దపడుతున్నది. ప్రాంతీయ సహకారం కోసం దక్షిణాసియా సంఘం (సార్క్) సదస్సుకు మోదీని ఆహ్వానిస్తామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి డాక్టర్ మహ్మద్ ఫైజల్ తెలిపారు. అయితే ఈ సదస్సు నిర్వహించే తేదీలు ఇంకా ఖరారు కాలేదు.

సార్క్ సదస్సు 2016లో పాకిస్థాన్‌లో జరగవలసి ఉంది. కానీ భారతదేశం బహిష్కరించడంతో ఈ సమావేశాన్ని రద్దు చేశారు. భారత్ తో పాటు ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్ లు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.

పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్‌ గురుద్వారాకు భారతీయ సిక్కులు వెళ్ళేందుకు సదుపాయాలు కల్పించేందుకు భారత్, పాక్ ప్రభుత్వాలు ముందుకు రావడంతో రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పరచుకోవడానికి ఇదే తగు అదను అని పాకిస్తాన్ భావిస్తున్నట్లు కనబడుతున్నది. పాకిస్థాన్ వైపు ఈ పనులకు శంకుస్థాపన బుధవారం జరుగుతుంది.

ఈ సందర్భంగా హాజరు కావాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను పాకిస్థాన్ ఆహ్వానించింది. కానీ సుష్మా స్వరాజ్ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇద్దరు కేంద్ర మంత్రులను పంపుతామని తెలిపారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి మీడియాతో మాట్లాడుతూ సార్క్ సమావేశాలకు మోదీని ఆహ్వానిస్తామని తెలిపారు.