బిజెపిలో మాజీ ఐఏఎస్‌ అధికారిణి అపరాజిత

మాజీ ఐఏఎస్‌ అధికారిణి అపరాజిత సారంగి మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఒడిశా బీజేపీ అధ్యక్షుడు బసంత్‌ పాండా కుడా పాల్గొన్నారు.

1994 బ్యాచ్‌కు చెందిన అపరాజిత ఒడిశా క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణి. ఆమె 2013 నుంచి సెంట్రల్‌ డిప్యూటేషన్‌ మీద ఉన్నారు. అపరాజిత మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం జాయింట్‌ సెక్రటరీగా పనిచేశారు. ఆమె చేపట్టిన ఈ పదవీకాలం 2018 ఆగస్టులో ముగిసింది.

దీంతో సెప్టెంబర్‌లోనే ఆమె వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబర్‌ 16వ తేదీన ఆమోదించారు. ఆమె ఒడిశాలో విధులు నిర్వర్తిస్తున్న కాలంలో భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా తనదైన ముద్ర వేశారు.