తెలంగాణా ఓటర్లకు ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు ఎన్నికల ప్రచారానికి రావడానికి ముందుగా తెలుగులో ట్వీట్ ఇస్తూ బిజెపికి విజయం చేకూర్చాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసారు.  రాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో తొలిసారిగా ఆయన పాల్గొనబోతున్న సందర్భంగా తెలంగాణ ఎన్నికల గురించి మోదీ ట్వీట్‌ను తెలుగులోనే చేయడం విశేషం.

నేడు నిజామాబాద్‌, మహబూబ్‌నగర్ ఎన్నికల ర్యాలీలో తాను పాల్గొంటున్నానని, ఈ సభ కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి విజయం సాధించేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

‘నా ప్రియాతి ప్రియమైన తెలంగాణా సోదర సోదరీమణులారా!! ఇవాళ మన తెలంగాణా గడ్డ మీద అడుగుపెట్టడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను... మొదట నేను నిజామాబాద్ ర్యాలీలో మాట్లాడిన తరువాత మహబూబ్‌నగర్‌లో మీతో నా భావాలు పంచుకొంటాను.. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడానికి మీ ఆదరాభిమానాలు, ఆశీస్సులను కోరుకుంటున్నాను. NM Mobile app ద్వారా ఈ ర్యాలీ విశేషాలను నిరంతరం చూడండి’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

తెలంగాణలో ప్రధాని మోదీ మొత్తం మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. వీటిలో ఉత్తర తెలంగాణలో నిజామాబాద్‌, దక్షిణ తెలంగాణలో మహబూబ్‌నగర్‌ సభలు మంగళవారం జరగనుండగా, డిసెంబరు 3న హైదరాబాద్‌లో మోదీతో భారీ బహిరంగసభను నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది.