ప్రధాని నరేంద్ర మోదీ నేడే తెలంగాణలో పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో తొలిసారిగా పాల్గొనబోతున్నారు. మంగళవారం నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లలో జరిగే బహిరంగ సభలకు ఆయన హాజరు కానున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బిజెపి శ్రేణులు, ఈ పర్యటనపై గట్టి ఆశలూ పెట్టుకున్నాయి.

ప్రధాని మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంగళవారం నిజామాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో మహబూబ్‌నగర్‌కు వెళతారు. అక్కడ ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళతారు.

ప్రధాని వెంట ఈ సభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హాజరవుతారు. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన దాదాపు నాలుగు గంటలకు పైగా జరగనుంది.

తెలంగాణలో ప్రధాని మోదీ మొత్తం మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. వీటిలో ఉత్తర తెలంగాణలో నిజామాబాద్‌, దక్షిణ తెలంగాణలో మహబూబ్‌నగర్‌ సభలు మంగళవారం జరగనుండగా డిసెంబరు 3న హైదరాబాద్‌లో మోదీతో భారీ బహిరంగసభను నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది.