తెలంగాణ ఆరోగ్య కిట్లపై కేంద్రం దర్యాప్తు !

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద బాలికలకు ఇచ్చే ఆరోగ్య కిట్ల సరఫరాలో భారీ కుంభకోణం జరిగిన్నట్లు కధనాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ అంశం రాష్ట్ర హైకోర్టుకు చేరడం, దానిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో  కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. కేంద్ర మానవ వనరుల శాఖ అండర్ సెక్రటరీ పూర్ణిమా తుడు ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

మధ్యలో చదువు నిలిపేసి వెళ్లిపోయే యుక్తవయసు విద్యార్ధినిలను ప్రోత్సహించేందుకు గతంలో ప్రభుత్వం నెలకు రూ.100 కాస్మొటిక్ ఛార్జీల కింద ఇచ్చేది.  అయితే ఇది సరిగా అందడం లేదన్న నెపంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు హెల్త్ కిట్లను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలలో చదువుకుంటున్న 6.5 లక్షల మంది పేద విద్యార్థినిలకు ఉపయోగపడేలా ఈ హెల్త్ కిట్లు రూపొందించారు.

 ఒక్కో కిట్టులో మూడు ఒంటి సబ్బులు, మూడు బట్టల సబ్బులు, షాంపూ ప్యాకెట్లు, కొబ్బరి నూనె, శానిటరీ నాప్‌కిన్‌లు, టూత్ పేస్ట్, టాల్కం పౌడర్, రిబ్బన్, బొట్టుబిళ్లలు, హ్యాండ్ వాష్ లాంటి వస్తువులు ఉంటాయి. దీనికి అనుగుణంగా ప్రభుత్వం టెండర్లను పిలిచింది. రూ.297.99కి ఒక్కో కిట్ అందిస్తామని చెప్పిన లైట్ హౌజ్ అనే సంస్థకు మొదట ఈ కాంట్రాక్టు అప్పగించింది.

అయితే ఆ తర్వాత నాశిరకం సబ్బులతో కూడిన వస్తువులను కలిపి అధికధర కోట్ చేసిన (రూ.420) ‘మా యార్న్ ఆండ్ ఫైబర్’ అనే మరో సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా తదుపరి టెండర్‌ను కట్టబెట్టారు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు కూడా చేతులు కలిపి ఆడపిల్లల ఆరోగ్య హక్కులకే భంగం కలిగిస్తూ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఇలా క్లినికల్‌గా అనుమతి పొందని వస్తువులను ఇవ్వడం ద్వారా బాలికల ఆరోగ్యం దెబ్బతింటుంది.

తమకు జరిగిన అన్యాయం, తద్వారా తెలంగాణలోని బాలికల ఆరోగ్యానికి వచ్చే ప్రమాదం తదితర అన్ని విషయాలను లైట్ హౌజ్ ప్రమోషన్స్ సంస్థ ఉన్నతాధికారులకు చెప్పినా ఎవరూ స్పందించలేదు. దాంతో లైట్ హౌజ్ ప్రమోషన్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. టెండర్ నిబంధనలు ఉల్లంఘించి మా యార్న్ ఆండ్ ఫైబర్ సంస్థకు అప్పగించిన టెండర్లను రద్దుచేసి, తిరిగి కొత్త టెండర్లను పిలిచేలా చర్యలు చేపట్టాలని తమ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

సరఫరా చేసే వస్తువులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలనే నిబంధనను కూడా మా యార్న్ సంస్థ తుంగలో తొక్కిన వైనాన్ని కూడా లైట్ హౌజ్ సంస్థ తెలియజేసింది. పిటిషన్‌కు స్పందించిన హై కోర్ట్  మా యార్న్ ఆండ్ ఫైబర్‌కు అడ్డదారిలో కట్టబెట్టిన టెండర్‌ను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కిట్లను మా యార్న్ అండ్ ఫైబర్ సంస్థ నుంచి కొనుగోలు చేయవద్దని హైకోర్టు స్టే విధించింది. తుది తీర్పు వచ్చే వరకు ‘మా యార్న్’ ఫైబర్ కిట్స్ సరఫరా చేసినా స్వీకరించవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

ఈ టెండర్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఖరారు చేశారని, ఇందులో ఆరు సంస్థలు పాల్గొనగా, ఒకే సంస్థకు మేలు కలిగేలా టెండర్ నిబంధనలు రూపొందించారని కూడా పిటీషనర్ల తరఫు అడ్వకేట్లు తమ వాదనలు విన్పించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏ నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించింది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు కోట్ల రుపాయాల అడ్వాన్స్ ఇచ్చేసింది. ఆ తర్వాత మధ్యంతర ఉత్తర్వులు రద్దయ్యాయి. అయితే కేసు విచారణ కొనసాగుతున్నది. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకున్నది.

సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాల ప్రకారం ఒకే సంస్థ లేదా ఒకే వ్యక్తి ఫైనాన్షియల్ బిడ్‌కు ఎంపికైన సందర్బంలో రద్దు చేయాలి. మళ్లీ టెండర్లు ఆహ్వానించాలి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫోర్టల్ జెమ్ నుంచి వస్తువుల ధరలను నిర్ధారించుకోవాలి. కాని టెండర్ కమిటీ ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరించింది. పైగా తక్కువ ధరకు నాణ్యమైన సరకు ఇస్తామని చెప్పిన వారిని కాదని 35 శాతం ఎక్కువ ధరకు సరకులు సరఫరా చేస్తానని ముందుకు వచ్చిన సంస్థకు టెండర్ అప్పగించారు.

ఈ కిట్లను మూడు నెలలకోసారి చొప్పున ఏడాదికి నాలుగు సార్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇందు కోసం దాదాపుగా రూ.100 కోట్లను కేటాయించారు. ఇలా నిధులను నీళ్లలా ఖర్చు చేయడమే కాకుండా బాలికలకు ఆరోగ్య సమస్యలు కూడా తెచ్చిపెట్టే ఈ నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలని నిర్ణయించింది. ఇన్ని జరుగుతున్నా కూడా పట్టనట్లు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ కిట్లను అందించే కార్యక్రమానికి అధికారికంగా శ్రీకారం చుడుతోంది.