మూడు రాష్ట్రాలలో తిరిగి బిజెపి ప్రభుత్వాలే.. అమిత్ షా ధీమా

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో తిరిగి బిజెపి అధికారంలోకి వస్తుందని బిజెపి అద్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేసారు. ఆయా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని, ఆయా రాష్ట్రాల్లో బిజెపి మళ్లీ అధికారంలో రాలేదని వస్తున్న వాదనలతో తాను ఏకీభవించబోనని స్పష్టం చేసారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే శాసనసభ ఎన్నికలు ముగియగా, మధ్యప్రదేశ్‌లో బుధవారం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

 ‘ఆ మూడు రాష్ట్రాల్లో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తుంది. డిసెంబరు 11న వెలువడే ఎన్నికల ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అతి శక్తిమంతమైన, ప్రజలకు చేరువైన నేతగా రుజువు చేస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి ఆయనే మళ్లీ ప్రధాని అవుతారు’ అని భరోసా వ్యక్తం చేసారు.

‘ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత, ప్రతికూలత అనే రెండు అంశాలూ ఉంటాయి. అయితే, దురదృష్టవశాత్తూ మీడియా ఈ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతపైనే దృష్టి పెట్టింది. బిజెపి ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో చేసిన అభివృద్ధి పనులు, సుపరిపాలనే అజెండాగా ప్రచారం చేస్తూ, మేము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మంచి పనులను ప్రజలు గుర్తిస్తున్నారు. తిరిగి బిజెపినే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు’ అని తెలిపారు

ఆ మూడు రాష్ట్రాల్లో తాము 129 ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశామని చెబుతూ  కొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రభావం దేశంలోని ఓటర్లపై ఉంటుందని పేర్కొన్నారు. 2014కి ముందు రెండు సార్లు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈ పదేళ్ల కాలంలో ఆ రాష్ట్ర అభివృద్ధి నెమ్మదిగా జరిగిందని, కానీ, 2014లో కేంద్రంలోనూ బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఐదేళ్లలో మధ్యప్రదేశ్‌ మరింత వేగంగా అభివృద్ధి జరిగిందని అమిత్ షా వెల్లడించారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అనంతరం బిజెపి ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, హరియాణాతో పాటు చాలా రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేసిందని గుర్తు చేసారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల ప్రభావం పరస్పరం.. ఒకదానిపై ఒకటి పడుతోంది కాబట్టి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు తమకు చాలా ముఖ్యం అని అని అమిత్‌ షా పేర్కొన్నారు.

టీఆర్ఎస్‌ తో స్నేహపూర్వక పోటీ లేదు

పార్లమెంటులో బిజెపికి టీఆర్ఎస్‌ పలుసార్లు మద్దతు తెలిపిన నేపథ్యంలో తెలంగాణలో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వకపోటీ ఉందా? అన్న ప్రశ్నపై అమిత్‌ షా స్పందిస్తూ  తెలంగాణలో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ లేదని, పూర్తి స్థాయిలో బిజెపి పోటీ చేస్తోందని స్పష్టం చేసారు. అయితే పార్లమెంటులో టీఆర్ఎస్‌ ముందు రెండే మార్గాలు ఉంటాయని చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపడం లేదా ప్రతిపక్షానికి మద్దతు తెలపడమా అని, దీంతో వారు బిజెపికే మద్దతు తెలిపారని చెప్పారు. అంతమాత్రాన ఇరు పార్టీలు తెలంగాణలో స్నేహపూర్వకపోటీ చేస్తున్నట్లు కాదని తెలిపారు.

కాగా, కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ్‌ బెంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని ఆయన చెప్పారు. సీబీఐ విషయంలో సీవీసీ జోక్యం చేసుకుని, చట్ట ప్రకారం వ్యవహరిస్తుందని తెలిపారు. ఇందులో ఎన్డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు ఎలా చేస్తారని ఆయన నిలదీశారు.

ఇలా ఉండగా, ‘అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై తాము నిబద్ధతతో ఉన్నామని స్పష్టం చేసారు. ఈ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని చెబుతూ ఈ కేసులో ఇన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబాల్‌ మరో డిమాండ్ చేశారని గుర్తు చేసారు. 2019 లోక్‌సభ ఎన్నికల తరువాతే ఈ కేసుపై సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగాలని కోరారని అంటూ బిజెపికి ఈ విషయంలో ఉన్న ఉద్దేశంపై మాత్రం ఎవరికీ అనుమానాలు లేవని స్పష్టత ఇచ్చారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారం మానుకోవాలని హితవు చెప్పారు. ఇక శివసేన గురించి ప్రస్తావిస్తూ “మావి రెండు వేర్వేరు పార్టీలు.. అయిప్పటికీ మేము ఒకే కూటమిలో ఉన్నాం. మాలో ఈ విషయంపై విభేదాలు లేవు” అని చెప్పుకొచ్చారు.