టాయిలెట్ సీట్లలో కన్నా స్మార్ట్ ఫోన్‌లోనే సూక్ష్మక్రిములు

మల విసర్జన కోసం వాడే టాయిలెట్ సీట్లు అంటే మురికికి నిలయంగా, అత్యధికంగా  సూక్ష్మక్రిములు ఉండే ప్రదేశంగా భావిస్తూ ఉంటాము. కాని మనం ఎంతో విలాసవంతంగా, స్టైల్ గా వాడే స్మార్ట్ ఫోన్లలోనే అత్యధికంగా సుక్ష్మక్రిములు ఉంటున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. క్షణం కూడా మనం విడిచి ఉండలేని స్మార్ట్ ఫోన్లు మనపాలిట శాపంగా మారనున్నయా అనే భయం కుడా వ్యక్తం చేస్తున్నారు.

 

సాధారణంగా స్మార్ట్ ఫోన్లు వాడే వ్యక్తుల్లో 35 శాతం మంది అసలు వాళ్ల స్మార్ట్ ఫోన్లను శుభ్రం చేసుకోరట. దీంతో టాయిలెట్ సీటుకు మూడు రెట్ల క్రిములు స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీదే ఉంటాయట. స్కై.కామ్ అనే వెబ్ సైట్ చేసిన రీసెర్చ్‌లో ఇవన్నీ బయటపడ్డాయట. 20 మందిలో ఒక్క స్మార్ట్ ఫోన్ యూజరే ప్రతి ఆరు నెలల కంటే తక్కువ సమయంలో తన స్మార్ట్ ఫోన్‌ను శుభ్రం చేస్తారట.

స్మార్ట్ ఫోన్ల స్క్రీన్లపై ఎరోబిక్ బ్యాక్టీరియా, ఈస్ట్, మౌల్డ్ అనే మూడు రకాల సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయట. వీటివల్ల చర్మ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయట. ఈ సూక్ష్మక్రిములను ఆయా వస్తువుల వైశాల్యాన్ని బట్టి కొలిస్తే, ఒక్క స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద 84.9 యూనిట్లు ఉంటే, టాయిలెట్, ఫ్లష్ మీద కేవలం 24 యూనిట్లు మాత్రమె ఉంటుంది, కంప్యూటర్ కీబోర్డు, మౌస్ మీద కేవలం 5 యూనిట్లు మాత్రమే ఉంటాయట.

 

మనం ఎక్కడికెళ్లినా మన ఫోన్లు మన వెంటే ఉంటాయి. దీంతో ఎక్కువ సూక్ష్మక్రిములు దానికి అంటుకునే ప్రమాదం ఉందని పరిశోధకులు వారిస్తున్నారు. యూకేలో ఐదు శాతం బ్రిటీష్ యువకులు ఒక వారంలో తాము చేసే జాబ్ కంటే స్మార్ట్‌ఫోన్ మీదనే ఎక్కువగా గడుపుతున్నారట. ఇదివరకు ఐదుగురిలో ఇద్దరు యువకులు నిద్రలేచిన ఐదు నిమిషాల్లో తమ ఫోన్‌ను చూసేవారట.

 

ఇప్పుడు ఆ సంఖ్య పెరిగిందని, 37 శాతం మంది ఇదివరకు పడుకోవడానికి ఐదు నిమిషాల ముందు తమ ఫోన్లను కాసేపు చూసి పడుకునేవారట. ఆ సంఖ్య కూడా ఇప్పుడు 60 శాతానికి వచ్చిందట. ఇలా స్మార్ట్‌ఫోన్లపైనే ఎక్కువగా గడిపే వాళ్లంతా 35 ఏండ్ల లోపువాళ్లే అని పరిశోధకులు తెలిపారు.