మన్‌ కీ బాత్‌’ కు స్పూర్తి, బలం ప్రజలే : మోదీ

‘మన్‌ కీ బాత్‌’ 50వ కార్యక్రమంలో ఆదివారం మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడేది తానైనా దానికి స్ఫూర్తి, బలం మాత్రం ప్రజలేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. 50వ కార్యక్రమంలో ఆదివారం మాట్లాడుతూ  ‘మోదీ రావచ్చు, పోవచ్చు, దేశ ఐక్యత, మన సంస్కృతి మాత్రం శాశ్వతమైనవి. సాధారణంగా మీడియా పట్ల రాజకీయ నాయకులెవరూ సంతృప్తి చెందరు. తమ గురించి వ్యతిరేకంగా వచ్చిందనో, తక్కువగా వచ్చిందనో వారు భావిస్తుంటారు. నేను మాత్రం మీడియాకు కృతజ్ఞుడిని. ఈ కార్యక్రమాన్ని ప్రసార మాధ్యమాలు ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాయి’ అని చెప్పారు.

కార్యక్రమం రాజకీయాలకు, స్వీయప్రగల్భాలకు అతీతమైనదని చెబుతూ ఇది పూర్తిగా ప్రజల కోసమేనని, సమాజంలో సానుకూల భావనను ప్రోది చేయడంలో ఇదెంతో ఉపకరిస్తోందని పేర్కొన్నారు. ‘1998 మే నెలలో హిమాచల్‌ప్రదేశ్‌లో బిజెపి కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను. చల్లని కొండ ప్రాంతంలో ఒక సాయంత్రం తేనీటి కోసం దాబా వద్ద ఆగాను. టీ కంటే ముందు అక్కడి విక్రేత నా చేతికొక లడ్డూ ఇచ్చి నోటిని తీపి చేసుకోమన్నారు. విశేషమేమిటని అడిగాను. భారతదేశం పెద్ద బాంబు (పోఖ్రాన్‌ అణు పరీక్ష)ను ప్రయోగించడంలో విజయవంతమైందట అని విక్రేత చెప్పాడు. అప్పటి ప్రధాని వాజ్‌పేయీ చేసిన ప్రకటనను రేడియోలో విని సంబరాలు చేసుకుంటున్నట్లు తెలిపాడు’ అని గుర్తు చేసుకున్నారు.

మంచుకొండల్లో, దుర్గమమైన ప్రాంతంలో ఒక వ్యక్తి రేడియో వింటూ రోజువారీ పనులు చేసుకుంటుండడం, దానిలో వచ్చే సందేశం అలాంటివారిని ఎంతో ప్రభావితం చేస్తుండడం తనను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయని పేర్కొన్నారు. రేడియో ప్రభావం గురించి అప్పుడే తన మదిలో గట్టిగా నాటుకుపోయిందని చెబుతూ దేశ ప్రధానిగా 2014లో  బాధ్యతలు చేపట్టాక బలమైన, ప్రభావవంతమైన మాధ్యమం ద్వారా ప్రజల్ని చేరుకోవాలనుకున్నట్లు వివరించారు.

దేశ ఐక్యత, గొప్పతనం, త్యాగాలు, భిన్నత్వంలో ఏకత్వం, వృద్ధి ప్రస్థానం వంటివి పల్లెల నుంచి నగరాల వరకు వివరించడానికి ప్రతి నెలా చివరి ఆదివారం మన్‌ కీ బాత్‌ ద్వారా మాట్లాడాలని అప్పట్లో నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 2014 అక్టోబరులో మొదలై నేటితో 50 నెలలు పూర్తయ్యాయని చెప్పారు.  1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భాన్ని మోదీ గుర్తుచేస్తూ డాక్టర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తిని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు.

మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని 70.8% మంది శ్రోతలు వింటున్నట్లు ఆకాశవాణి సర్వేలో తేలింది. ఈ కార్యక్రమంతో తాము ప్రేరణ పొంది సామాజిక సేవ చేస్తున్నట్లు 62% మంది చెప్పారు. పరిశుభ్రత, ఆడపిల్లల పరిరక్షణ, యోగా వంటి అంశాలపై ప్రధాని సందేశాలు తమనెంతో ఆకట్టుకున్నాయని తెలిపారు.