ఈ ఒక్కసారి బీజేపీకి పట్టం కట్టండని కోరిన అమిత్ షా

‘ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈ ఒక్కసారి బీజేపీకి పట్టం కట్టండి’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణ ప్రజలను కోరారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోనే తెలంగాణను మోడల్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక,  నారాయణఖేడ్ తదితర చోట్ల జరిగిన ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగిస్తూ ఈ ఎన్నికల్లో రాజకీయ మార్పులో భాగంగా బీజేపీని గెలిపించండి. తెలంగాణను అభివృద్ధి చేసి దేశంలో మోడల్‌గా తీర్చిదిద్దుతాం.” అని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్, మహాకూటమి మధ్య ఎన్నికల పోరాటం జరుగుతోందని చెబుతూ మహాకూటమిలో ప్రపంచంలో కనుమరుగైన కమ్యూనిస్టులు, దేశంలో అంతర్థానమైన కాంగ్రెస్, అవసరం లేని టీడీపీ ఉన్నాయని అమిత్ షా ఎద్దేవా చేశారు. ప్రజలు ఎవరి ప్రభుత్వం అవసరమో గుర్తించబోతున్నారని ధీమా వ్యక్తం చేసారు.

టీఆర్‌ఎస్, మహాకూటమి అధికారంలోకి వచ్చినా మజ్ల్లిస్ దాదాగిరి నుంచి రాష్ట్రాన్ని కాపాడలేవని, బీజేపీ అధికారంలోకి వస్తేనే విముక్తి కలుగుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను గద్దె దించే శక్తి బీజేపీకే ఉందన్న అమిత్ షా ఈ సందర్భంగా కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఆయన పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాలున్నరేళ్లలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వెల్‌లోనే 131 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు.

అందరికీ రక్షిత తాగునీరు ఇస్తేనే ఓట్లడుగుతానని చెప్పిన కేసీఆర్, అది జరగకుండానే.. ఎన్నికలకు వెళ్లారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మోడీ చరిస్మా కారణంగా ఓడి పోతామన్న భయంతోనే ముందస్తుకు వెళ్లారని ఆయన విమర్శించారు. 1.7 లక్షల మందికి ఉద్యోగాలిస్తానని చెప్పి ఎవ్వరికీ ఇవ్వలేదని ద్వజమెత్తారు. ఇప్పుడు రాష్ట్రంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దీంతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని పేర్కొన్నారు.

రాష్ట్రానికి కేంద్రం రూ. 2.30 లక్షల కోట్ల నిధులిచ్చినా రాష్ట్ర ప్రజలపై రూ. 2 లక్షల కోట్ల అప్పుల భారం మిగిల్చారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.

ప్రధాని మోదీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అన్ని వర్గాల ప్రజలు జేజేలు పలుకుతున్నారని చెబుతూ ఈ గౌరవం మోదీకి, బీజేపీకి వచ్చింది కాదని, యావత్‌ భారత దేశ ప్రజలకు వచ్చిందని అమిత్ షా తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక సరిహద్దుల్లో భద్రత పెరిగింది. దేశ ప్రజలకు ధీమా వచ్చింది. దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.. అంటే 70 శాతం భూభాగం బీజేపీ పాలనలో ఉందని గుర్తు చేసారు.