ఆంధ్రప్రదేశ్‌లో 52,67,637 నకిలీ ఓట్లు

ఆంధ్రప్రదేశ్‌లో 52,67,637 నకిలీ ఓట్లను గుర్తించినట్లు, దీనికి అదనంగా మరో 20 లక్షలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రకటించారు.  ప్రధానంగా 34లక్షల 17వేలు డూప్లికేట్, రిపీట్, అక్రమ, చెల్లని ఓట్లు ఉండగా, ఆంధ్ర ఓటర్లు 18లక్షల 50వేల మంది తెలంగాణ ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. వందేళ్ల వయస్సు కలిగిన వారు, 18 ఏళ్లలోపు వారు, ఇంటి నెంబర్లు లేనివారిని కూడా ఓటర్లుగా చూపారని ఆరోపించారు.

గత సెప్టెంబర్ 1న ప్రచురితమైన ఓటర్ల జాబితాలో 3 కోట్ల, 60లక్షల మందిని ఓటర్లుగా పేర్కొన్నారని చెప్పారు. ఒకే ఓటర్ ఐడీతో ఒకే వ్యక్తి రెండు లేక అధిక ఓట్లు కలిగిన వారు 36లక్షల 40 మంది, ఓటరు పేరు, తండ్రి, లేదా భర్త పేరు, ఇంటి నెంబర్, వయస్సు, జెండర్ ఒకేలా ఉన్న నకిలీ ఓట్లు 82వేల 88, ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఇంటి నెంబర్, జెండర్ ఒకేలా ఉండి వయస్సులో మాత్రమే తేడా ఉన్న నకిలీ ఓట్లు 24,928 ఉన్నాయన్నారు. ఓటర్, తండ్రి, భర్త పేరు, ఇంటి నెంబర్, వయస్సు ఒకేలా ఉండి జెండర్ మాత్రమే తేడా ఉన్న నకిలీ ఓట్లు 1006 అని వివరించారు.

కాగా, ఓటరు పేరు ముందుకు వెనకకు మారిన నకిలీ ఓట్లు ఉదాహరణకు వరలక్ష్మీ కొండేటి, కొండేటి వరలక్ష్మీ ఇలా 2లక్షల 60వేల, 634 పేర్లు చేరాయని చెప్పారు. ఓటరు పేరు, తండ్రి, లేదా భర్త పేరు ఒకేలా ఉండి ఇతర వివరాలు వేరుగా ఉన్న పేర్లు 25లక్షలు 17వేల, 164 ఉన్నాయని, 18ఏళ్లు కంటే తక్కువ వంద కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 6,126 మంది, ఇంటి నెంబర్ తప్పున్న నకిలీ ఓట్లు 3,95,877 ఉన్నాయని అరుణ్‌కుమార్ వివరించారు.