తెలుగు దేశంలో ఇక లోకేష్ హవా, సీనియర్లలో కలవరం

2019 ఎన్నికల నాటికి తెలుగు దేశం పార్టీలో, ప్రభుత్వంలో పెత్తనం అంతా `వారసుడు’ నారా లోకేష్ పరం చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటికే లోకేష్ ను `సార్’ అని పిలవలేని, పార్టీలో చిరకాలంగా ఉంటున్న నాయకులను పక్కన పెట్టడం ద్వారా తనకు సంబంధం లేని శాఖలలో సహితం లోకేష్ జోక్యం చేసుకోనేటట్లు చేయడం చూస్తున్నాము. నిరుద్యోగ బృతి విషయం లోకేష్ మత్రిత్వ శాఖతో సంబంధం లేకపోయినా అదంతా ఆయనే చేస్తున్నట్లు ప్రచారం చేయడం చూసాము.

 

పార్టీలో సీనియర్లను ప్రక్కన పెట్టి వైసిపి నుండి ఫిరాయించిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం కుడా ప్రభుత్వంలో లోకేష్ ప్రాబల్యం పెంచడం కోసమే అని అందరికి తెలిసిందే. ఇదే విధంగా వచ్చే ఎన్నికలలో అభ్యర్ధులు చాలావరకు లోకేష్ ఎంపిక చేసే వారే ఉంటారని చెబుతున్నారు. సేనియర్లు చాలామందిని పక్కకు పెట్టి వారి కుటుంభ సభ్యులకో, కొత్తవారికో యువకులకు సీట్లు ఇవ్వడం కోసం రంగం సిద్దం చేస్తున్నారు. ఈ పక్రియ సహజంగానే పార్టీలో కలవరం కలిగిస్తున్నది.

 

2009 ఎన్నికలలో ఇదే విధంగా పార్టీలో, ప్రభుత్వంలో కుమారుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యం పెంచడం కోసం 60 సీట్లలో జగన్ ఎంపిక చేసిన యువతరానికి లేదా కొత్తవారికి సీట్లను వై ఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చారు. ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సహితం కుమారుడి `పట్టాభిషేకం’కు మార్గం సుగమం చేయడానికి అదే మార్గం అనుసరించ బోతున్నట్లు టిడిపి వర్గాలో చర్చ జరుగుతున్నది.

 

కొందరు సేనియర్లను లోక్ సభకు పోటీ చేయమనడమో, తిరిగి అధికారంలోకి వస్తే యేవో కొన్ని ప్రభుత్వ పదవులు ఇస్తామని చెప్పడమో లేదా వారి కుటుంభ సభ్యులకు సీట్లు ఇవ్వడమో చేయడం కోసం రంగం సిద్దం చేస్తున్నారు. దానితో ఖంగుతిన్న పలువురు సేనియర్లు తమకు సీట్లు ఇవ్వని పక్షంలో బిజెపి వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

 

ఉత్తరాంధ్రలో సీనియర్‌ నాయకుడు మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు స్థానంలో ఆయన కుమార్తె అతిధిని ఎంపి లేక ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

 

అట్లాగే మంత్రి గంటా శ్రీనివాసరావు స్థానంలో ఆయన కుమారుడు గంటా జయదేవ్, స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్థానంలో అయన కుమారుడు శివరామ్, బోజ్జల గోపాలక్రిష్ణారెడ్డి స్థానంలో ఆయన కుమారుడు సుదీర్, రాయపాటి సాంబశివరావు స్థానంలో ఆయన కుమారుడు రంగాప్రసాద్, జేసి దివాకరరేడ్డి స్థానంలో ఆయన కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, పరిటాల సునీత స్థానంలో ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్... ఇట్లా వారసులకు రాజకీయ ప్రవేశం కల్పించడానికి ప్రణాలికలు వేస్తున్నారు.

 

ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో వారసులే హాల్ చల్ చేస్తున్నారు. అధికారులపై అజమాయిషీ చేస్తున్నారు. గతవారం హైదరాబాద్ లో రాహుల్ గాంధీ రాక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన యువపారిశ్రామిక వేత్తల సదస్సులో రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ కుమారుడు భరత్, దివాకరరెడ్డి కుమారుడు పవన్ లతో పాటు స్వయంగా నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి పాల్గొనడం తెలిసిందే.