కాంగ్రెస్‌తోనే మందిర్‌ నిర్మాణంలో జాప్యం : మోదీ

అయోధ్యలో రామమందిర నిర్మాణంలో జాప్యానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపిం‍చారు. రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్వార్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్‌ న్యాయవ్యవస్ధను రాజకీయాల్లోకి లాగుతోందని, 2019 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా అయోధ్యపై కోర్టు తీర్పును వాయిదా వేయాలని ఓ కాంగ్రెస్‌ నేత కోరారని చెప్పారు.

న్యాయస్ధానాలపై భీతిగొలిపే వాతావరణాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాను అభిశంసించేందుకు కాంగ్రెస్‌ పార్టీ పూనుకోవడాన్ని ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలు సరైనవి కాదని హితవు చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ చేపట్టిన గరీబీ హఠావో నినాదంతో మార్పు రాలేదని, బ్యాంకుల జాతీయీకరణ విఫలమైందని శనివారం ప్రధాని మోదీ ప్రత్యర్ధి పార్టీపై ఆరోపణలు గుప్పించారు.

భారత తొలి ప్రధానిగా సర్ధార్‌ పటేల్‌ బాధ్యతలు చేపడితే రైతుల సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించేవారని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో వెల్లడించాలని శివసేన చీఫ్‌ డిమాండ్‌ చేసిన నేపథ్యంలో మందిర నిర్మాణంలో జాప్యానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ప్రధాని మోదీ ఆరోపించడం గమనార్హం.

తన ప్రభుత్వంపై మాట్లాడేందుకు అంశాలు కరువైనందునే కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ అనుమతితో తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ప్రధాని ఆరోపించారు. మూడు దశాబ్ధాల కిందట మరణించిన తన తండ్రిని కాంగ్రెస్‌ నేతలు ప్రస్తావిస్తున్నారని దుయ్యబట్టారు. వంద తరాలుగా తన కుటుంబానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం  చేశారు.

గుజరాత్‌లోని మారుమూల గ్రామంలోని ఓ పేద చిన్నకుటుంబం తమదని మోదీ చెప్పుకొచ్చారు. తన కుటుంబాన్ని బయటకు ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించిన మోదీ మోదీ కూడా తమ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని రాహుల్‌ చెబుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ కుటుంబ సభ్యుల గురించి తానేమీ మాట్లాడటం లేదని, దేశ మాజీ ప్రధానులు, కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేతల గురించే తాను ప్రస్తావిస్తున్నానని తెలిపారు.

కాంగ్రెస్‌ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కాగా ప్రధాని మోదీ తన తండ్రి ఎవరో చెప్పాలంటూ కాంగ్రెస్‌ నేత విలాస్‌రావు ముత్తెంవార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు రాజ్‌బబ్బర్‌ రూపాయి విలువ మోదీ తల్లి వయసు స్ధాయికి క్షీణిస్తోందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.